ఆ విషయంలో అమెరికాను వెనక్కి నెట్టిన ఇండియా

24 Aug, 2021 16:44 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మేకిన్‌ ఇన్‌ ఇండియా కాన్సెప్టు క్రమంగా ప్రభావం చూపుతోంది. మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం ఇటీవల విడుదలైన ద కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది.

ద కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ 
వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించి ద కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సంస్థ వివిధ అంశాలపై ప్రతీ ఏడు సర్వేలు నిర్వహిస్తోంది. ఈ ఏడు నిర్వహించిన సర్వేలో ఇండియా సానుకూల ప్రగతిని సాధించినట్టు ఈ సర్వే ప్రకటించింది. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్‌ సెక్టార్‌లో ఇండియా పరిస్థితి మెరుగైంది. ప్రపంచంలోనే తయారీ రంగానికి సంబంధించి అత్యంత అనుకూలమైన దేశాల్లో రెండో స్థానం సాధించింది. ఇంతకు ముందు ఈ స్థానంలో అమెరికా ఉండేది. యూఎస్‌ఏను వెనక్కి నెట్టి ఇండియా ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇక ఎప్పటిలాగే మాన్యుఫాక్చరింగ్‌ సెక్టార్‌లో చైనానే అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఇండియాకు అనుకూలించేనా ?
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల్లో సింహభాగం అమెరికాకు చెందినవే ఉన్నాయి. ఇటీవల చైనాతో నెలకొన్న వివాదం నేపథ్యంలో చైనాలో ఉన్న తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలించే యోచనలో అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికా కంపెనీలకు ఏషియాలో తయారీ హబ్‌గా చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా ఎదిగేందుకు అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది. ఈ అంశంలో ఇండియాకు ఇండోనేషియా, తైవాన్‌, వియత్నాంల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

వ్యయ నియంత్రణలో వెనుకబాటు
తయారీ రంగంలో ఇండియా పరిస్థితి మెరుగైనప్పటికీ వ్యయ నియంత్రణలో ఇండియా వెనుకడుగు వేసినట్టు ద కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సర్వే ప్రకటించింది. గతంలో కాస్ట్‌ సినారియోలో ఇండియా ద్వితీయ స్థానంలో ఉండగా ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. అనూహ్యంగా ఇండోనేషియా ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు థాయ్‌లాండ్‌ ఎనిమిదో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చి చేరింది. వ్యయ నియంత్రణలో ఇండియాకు తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక కాస్ట్‌ విషయంలో కూడా ప్రథమ స్థానంలో చైనానే ఉంది.

ఇండియాలో రిస్క్‌ ఎక్కువ
బిజినెస్‌ రిస్క్‌కు సంబంధించి ఇండియాకు ప్రతికూల ఫలితాలే ద కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సర్వేలో వెల్లడయ్యాయి. ముఖ్యంగా పాలసీలు, పొలిటికల్‌ ప్రెషర్‌లను పరిగణలోకి తీసుకుని ఈ సర్వేను రూపొందించగా ఇండియా టాప్‌ దేశాల సరసన కాకుండా రిస్క్‌ ఎక్కువగా ఉన్న మలేషియా, బెల్జియం, ఇండోనేషియా, బల్గేరియా, రోమేనియా, థాయ్‌లాండ్‌, హంగరీ, కొలంబియా, ఇటలీ, పేరు, వియత్నాంల సరసన నిలిచింది. ఈ విభాగంలో కూడా చైనా మొదటి స్థానంలో ఉండగా కెనడా, అమెరికా, ఫిన్‌లాండ్‌, చెక్‌ రిప్లబిక్‌ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

మెరుగుపడాల్సిందే
తయారీ యూనిట్‌కు కావాల్సిన స్థలం, మానవ వనరులు విషయంలో ఇండియా స్థానం మెరుగైనా పొలిటికల్‌ ప్రెషర్‌, పాలసీల విషయంలో వెనుకబడే ఉంది. ఇక కాస్ట్‌ విషయంలో తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. 

చదవండి : సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్

మరిన్ని వార్తలు