గరిష్టానికి విద్యుత్ డిమాండ్

10 Mar, 2023 00:36 IST|Sakshi

2022 మొత్తం మీద 6 శాతం అధికం

2023 జనవరిలో 12 శాతం ఎక్కువ

పూర్తిస్థాయిలో శ్రమిస్తున్న కంపెనీలు

బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు

న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్‌కు డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆర్థిక కార్యకలాపాలు బలంగా సాగుతుండడం, తయారీ రంగానికి కేంద్రం పెద్ద ఎత్తున మద్దతునిస్తూ ఉండడం, ప్రజల ఖర్చు చేసే ఆదాయంలో పెరుగుదల కలసి విద్యుత్‌ వినియోగాన్ని ఏటేటా ఆల్‌టైమ్‌ గరిష్టానికి తీసుకెళుతున్నాయి. దీంతో డిమాండ్‌ను చేరుకునేందుకు విద్యుత్‌ తయారీ సంస్థలు (పవర్‌ ప్లాంట్లు), బొగ్గు గనుల కంపెనీలు పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ ఏడాది జవవరిలో విద్యుత్‌ వినియోగం, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 13.5 బిలియన్‌ కిలోవాటర్‌ హవర్‌గా ఉంది. ఇది 12 శాతం వృద్ధికి సమానం. గ్రిడ్‌ ఇండియా నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. జనవరిలో గరిష్ట డిమాండ్‌ 211 గిగావాట్లుగా నమోదైంది. 2021 జనవరి నెలతో పోలిస్తే 10 శాతం ఎక్కువ. థర్మల్‌ ప్లాంట్లు 16 బిలియన్‌ కిలోవాటర్‌ హవర్‌ మేర ఉత్పత్తిని అదనంగా చేశాయి. ఇది క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 18 శాతం అధికం కావడం గమనించాలి.   

ఏటేటా పెరుగుదల..
దేశంలో విద్యుత్‌కు డిమాండ్‌ ఉష్ణోగ్రతల ఆధారితం కాకుండా, నిర్మాణాత్మకంగానే పెరుగుతూ వస్తోంది. 2022 సంవత్సరం విద్యుత్‌కు డిమాండ్‌ 6 శాతానికి పైన పెరిగింది. కానీ, గడిచిన దశాబ్ద కాలంలో వార్షికంగా విద్యుత్‌ సగటు పెరుగుదల 4%గానే ఉండడం గమనించాలి. దేశంలో వ్యాపార కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నట్టు ‘పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌’ సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి. తయారీలో 55.4గా ఉంటే సేవల పీఎంఐ 57.2గా జనవరి నెలకు నమోదయ్యాయి.

కంపెనీలకు సమస్యలు
దేశీయంగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు సరిపడా బొగ్గును సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కోల్‌ ఇండియా ఒక్కటే 90% అవసరా లు తీరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది 12% అధికంగా బొగ్గు సరఫరా జరిగింది. కానీ, విద్యుదుత్పత్తి సంస్థల వాస్తవ అవసరాల కంటే ఇది తక్కువ కావడం గమనించాలి. అందుకే 10% వరకు విదేశీ బొగ్గును దిగుమతి చేసి వాడుకోవాలంటూ కేంద్రం సూచనలు సైతం చేసింది.

రైల్వే శాఖ ఫిబ్రవరిలో రోజువారీగా 271 గూడ్స్‌ రైళ్లను బొగ్గు సరఫరా కోసం నడిపించింది. కానీ, వాస్తవ లక్ష్యమైన రోజు వారీ 313 రైళ్ల కంటే తక్కువేనని తెలుస్తోంది. ముఖ్యంగా ప్లాంట్లకు కావాల్సినంత బొగ్గును సరఫరా చేయడంలో రైల్వే వైపు నుంచి కొరత ఉంది. ప్రస్తుతం కంపెనీల వద్ద 12 రోజుల విద్యుత్‌ తయా రీ అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో 9 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. 2021లో 15 రోజులు, 20 20లో 28 రోజులు, 2019లో 18 రోజులతో పోలిస్తే బొగ్గు నిల్వలు తక్కువ రోజులకే ఉన్నట్టు తెలుస్తోంది.

సరఫరా పెంచేందుకు చర్యలు..
బొగ్గు సరఫరా పెంచేందుకు గాను విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటూ జెన్‌కోలను కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశీ బొగ్గుతో కలిపి తయారీకి వినియోగించుకోవాలని సూచించింది. దిగుమతి చేసుకునే బొగ్గుతో నడిచే ప్రైవేటు సంస్థలను సైతం గరిష్ట స్థాయిలో విద్యుత్‌ తయారీ చేయాలని ఆదేశించింది. పునరుత్పాదక విద్యుత్‌ తయారీని పెంచేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు కొంత వరకు ఉపశమనం కల్పించాయి.

కానీ, బొగ్గు ఆధారిత సామర్థ్యంతో పోలిస్తే పునరుత్పాదక తయారీ సామర్థ్యం చాలా తక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికీ థర్మల్‌ ప్లాంట్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఫిబ్రవరిలో నమోదైన మొత్తం సరఫరాలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ 76 శాతం స్థాయిలో ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో పునరుత్పాదక ప్రాజెక్టుల ద్వారా విద్యుత్‌ తయారీ 15 శాతం పెరిగింది. విండ్‌ ద్వారా 50 శాతం పెరగ్గా, సోలార్‌ ద్వారా 37 శాతం పెరుగుదల ఉంది. మధ్యకాలానికి పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, దాంతో బొగ్గుపై ఆధారపడడం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.

మరిన్ని వార్తలు