ప్రీ–కోవిడ్‌ స్థాయికి పెట్రోల్‌ డిమాండ్‌

18 Sep, 2020 06:53 IST|Sakshi

ఇంకా డౌన్‌లోనే డీజిల్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో దారుణంగా పడిపోయిన పెట్రోల్‌ డిమాండ్‌ క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్య భద్రతల దృష్ట్యా ప్రయాణికులు  ప్రజా రవాణా కంటే వ్యక్తిగత రవాణాకే ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ సెప్టెంబర్‌ ప్రథమార్థంలో పెట్రోల్‌ అమ్మకాలు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌ అమ్మకాలు ప్రీ–కోవిడ్‌ స్థాయిని అందుకున్నాయని ప్రిలిమినరీ ఇండస్ట్రీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సెప్టెంబర్‌ 1 నుంచి 15 వరకు అమ్మకాలు 9.45లక్షల టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 9లక్షల విక్రయాలతో పోలిస్తే ఇది 2.2శాతం అధికం. ఇక నెలవారీ పరిశీలిస్తే ఆగస్ట్‌ 1–15 మధ్య మొత్తం అమ్మకాలు 9లక్షల టన్నులుగా ఉన్నాయి. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ విధింపు(మార్చి 25)తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి.

మరోవైపు డీజిల్‌కు డిమాండ్‌ పెరగడం లేదు. సమీక్షించిన కాలంలో వార్షిక ప్రాతిపదిక డీజిల్‌ అమ్మకాలు 6శాతం క్షీణత నమోదు చేశాయి. ఇక నెలవారీగా ఆగస్ట్‌తో పోలిస్తే అమ్మకాలు 19.3శాతం పెరిగాయి. అదే విధంగా వార్షిక ప్రాతిపదికన జెట్‌ ఫ్యూయల్‌ అమ్మకాలు 60శాతం క్షీణత చవిచూడగా, ఎల్‌పీజీ గ్యాస్‌ అమ్మకాలు 12.5శాతం వృద్ధిని సాధించాయి. కార్ల అమ్మకాలు 14శాతం పెరగ్గా, ద్విచక్ర వాహన అమ్మకాలు 3శాతం తగ్గాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతుంది. అయితే రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పరిమితులతో కూడిన లాక్‌డౌన్‌ విధింపులు డిమాండ్‌ పుంజుకునేందుకు ఆటంకాన్ని కల్గిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అన్‌లాక్‌ ప్రక్రియతో డిమాండ్‌ రికవరీ సంకేతాలు కన్పిస్తున్నాయని అయితే నెలవారీ వినియోగ వృద్ధిని అధిగమించేందుకు ఈ ఏడాది చివరి వరకు పట్టవచ్చని ఐఓసీ చైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య అన్నారు.

మరిన్ని వార్తలు