తయారీలో అమెరికాను మించిన భారత్‌ 

25 Aug, 2021 02:48 IST|Sakshi

ఆకర్షణీయ దేశంగా రెండో స్థానం 

కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక 

న్యూఢిల్లీ: తయారీ కార్యకలాపాలకు అత్యంత ఆకర్షణీయ దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికాను భారత్‌ వెనక్కి నెట్టింది. మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. అమెరికాతో పోలిస్తే భారత్‌లో తయారీ వ్యయాల భారం తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడింది. ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ రూపొందించిన 2021 అంతర్జాతీయ తయారీ రిస్క్‌ సూచీ నివేదిక ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి.

యూరప్, ఉత్తర–దక్షిణ అమెరికా, ఆసియా–పసిఫిక్‌ (ఏపీఏసీ)కి చెందిన 47 దేశాల్లో తయారీకి అనువైన ప్రాంతాలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ జాబితా రూపొందింది. ఇందులో ఈ ఏడాది అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. కెనడా, చెక్‌ రిపబ్లిక్, ఇండొనేíసియా, లిథువేనియా, థాయ్‌లాండ్, మలేసియా, పోలాండ్‌ దేశాలు వరుసగా తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి.  

ప్రాతిపదికగా నాలుగు అంశాలు .. 
మిగతా దేశాలతో పోలిస్తే తయారీ హబ్‌గా కంపెనీలు .. భారత్‌ను ఎంపిక చేసుకునే ధోరణి పెరుగుతోందనడానికి ఈ అధ్యయనం నిదర్శనమని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ పేర్కొంది. ‘భారత్‌లో నిర్వహణ పరిస్థితులు, వ్యయాలపరంగా ఇతర దేశాలకు గట్టి పోటీనివ్వగలిగే సామర్థ్యాలు ఇందుకు దోహదపడుతున్నాయి. అలాగే అవుట్‌సోర్సింగ్‌ అవసరాలకు తగ్గట్లు భారత్‌ రాణిస్తుండటమూ మరో కారణం‘ అని వివరించింది. తయారీని సత్వరం తిరిగి ప్రారంభించగలగడం, వ్యాపార పరిస్థితులు (కార్మికులు/నిపుణుల లభ్యత, అందుబాటులోని మార్కెట్‌), నిర్వహణ వ్యయాలు, రిస్కులు (రాజకీయ, ఆర్థిక, పర్యావరణపరమైనవి) అనే 4 అంశాలు ప్రాతిపదికగా ఈ అధ్యయనం నిర్వహించారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య వివాదాలతో పలు కంపెనీలు చైనా నుంచి తమ ప్లాంట్లను ఆసియాలోని ఇతర దేశాలకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.    

మరిన్ని వార్తలు