5జీ శకంలో భారత్‌ కీలక పాత్ర

25 Mar, 2021 23:58 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్, సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో 5జీ శకంలో భారత్‌ నిర్ణయాత్మక పాత్ర పోషించనుందని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) కార్యదర్శి ఎస్‌కే గుప్తా తెలిపారు. సరళతర విదేశీ పత్య్రక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానం, పురోగామి తయారీ పథకాలు, స్వావలంబన లక్ష్యాలు మొదలైన అంశాల ఊతంతో టెలికం రంగంలోకి భారీగా పెట్టుబడులు రాగలవని, వృద్ధికి మరింత తోడ్పాటు లభించగలదని ఆయన పేర్కొన్నారు.

ఆర్థికపరమైన, భద్రతాపరమైన అంశాల దృష్ట్యా టెలికం పరికరాల దిగుమతులపై భారీగా ఆధారపడాల్సి రావడం ఆందోళనకర అంశమని గుప్తా చెప్పారు. ‘టెలికం నెట్‌వర్క్‌ భారీగా విస్తరిస్తున్నప్పటికీ టెలికం పరికరాలకు సంబంధించి ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. టెలికం దిగుమతుల బిల్లు ఏటా రూ.లక్ష కోట్ల పైగానే నమోదవుతుండటం ఆందోళనకరం‘ అని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు నేరుగా 5జీ స్పెక్ట్రమ్‌
ప్రభుత్వరంగంలోని టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు వేలంలో పాల్గొనకుండానే 5జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించనున్నట్టు మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాజ్యసభకు గురువారం తెలిపారు. 4జీ సేవల కోసం స్పెక్ట్రమ్‌ కేటాయింపులకు ప్రతిపాదించిన మార్గదర్శకాల పరిధిలోనే 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. 5జీ సేవల కోసం స్పెక్ట్రమ్‌ కేటాయింపులకు పరిపాలనా పరంగా ఆమోదం కూడా తెలిపినట్టు చెప్పారు.

చదవండి: వన్‌ప్లస్‌ 5జీ స్మార్ట్‌ఫోన్లు : అద్భుత ఫీచర్లు

మరిన్ని వార్తలు