ఇండియా పోస్ట్‌ భారీ విస్తరణ

26 Aug, 2022 04:35 IST|Sakshi

కొత్తగా 10,000 శాఖలు...

ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభం

న్యూఢిల్లీ: ఇంటి వద్దకే సేవలను అందించడం లక్ష్యంగా ఇండియా పోస్ట్‌ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 10,000 శాఖలను తెరవనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు అనుమతి లభించిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ సెక్రటరీ అమన్‌ శర్మ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నూతన శాఖలను తెరువనున్నట్టు చెప్పారు. వీటి చేరికతో మొత్తం శాఖల సంఖ్య సుమారు 1.7 లక్షలకు చేరుతుందని వెల్లడించారు. ‘పోస్టల్‌ శాఖను విస్తరించాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది.

అయిదు కిలోమీటర్ల పరిధిలోనే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు చేరువలో ఉండాలన్నది భావన. పోస్టాఫీసుల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.5,200 కోట్లు సమకూర్చింది. డ్రోన్ల ద్వారా డెలివరీలను ఇటీవల గుజరాత్‌లో విజయవంతంగా నిర్వహించాం. 2012లో ప్రారంభించిన ఐటీ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. సాంకేతికత ఆధారంగా పోస్టల్, ఇతర ప్రభుత్వ సేవలు త్వరలో ఇంటి వద్దకే అందనున్నాయి. ప్రజలు పోస్టాఫీసులకు రావాల్సిన అవసరం ఉండదు. మహమ్మారి కాలంలో ఆధార్‌ సహిత చెల్లింపుల వ్యవస్థ ఆధారంగా రూ.20,000 కోట్ల పైచిలుకు నగదును ప్రజల ఇంటి వద్దకే చేర్చాం’ అని వివరించారు. 

మరిన్ని వార్తలు