ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ధరల్ని పెంచాల్సిందే.. పోటీ పడాల్సిందే!

12 Aug, 2022 07:34 IST|Sakshi

న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు జూలై మాసంలో వ్యాపార పరంగా మంచి వృద్ధిని చూశాయి. నూతన పాలసీల రూపంలో ప్రీమియం ఆదాయం 91 శాతం పెరిగి రూ.39,079 కోట్లు వసూలైంది. 2021 జూలైలో ఎల్‌ఐసీ సహా 24 జీవిత బీమా సంస్థలు నూతన పాలసీల రూపంలో సంపాదించిన ప్రీమియం ఆదాయం రూ.20,435 కోట్లుగా ఉండడం గమనించాలి. ఈ ఏడాది జూలైలో ఎల్‌ఐసీ నూతన పాలసీ ప్రీమియం రెండు రెట్లకు పైగా వృద్ధి చెందింది. గతేడాది జూలైలో రూ.12,031 కోట్ల ఆదాయం వసూలు కాగా, ఈ ఏడాది ఇదే నెలలో రూ.29,117 కోట్లకు దూసుకుపోయింది.

19 శాతం పెరిగిన ప్రీమియం ఆదాయం
జీవిత బీమా మార్కెట్లో ఎల్‌ఐసీ వాటా 68.6 శాతంగా ఉంది. మిగిలిన 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థలకు నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 19 శాతం పెరిగి రూ.9,962 కోట్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో 24 జీవిత బీమా సంస్థలకు కొత్త పాలసీల రూపంలో వచ్చిన ప్రీమియం ఆదాయం రూ.1,12,753 కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.73,160 కోట్లుగా ఉంది. ఒక్క ఎల్‌ఐసీ వరకే చూస్తే ఈ నాలుగు నెలల్లో నూతన ప్రీమియం ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.77,318 కోట్లు వసూలైంది.   

ప్రీమియం పెంచాల్సిందే.. పోటీ పడాల్సిందే! 
ప్రభుత్వరంగంలోని నాలుగు సాధారణ బీమా సంస్థలు.. ప్రైవేటు సంస్థలతో పోటీ పడాలంటే ప్రీమియం పెంచాల్సిందేనని, వాటి ఐటీ వ్యవస్థలను మెరుగుపరుచుకోక తప్పదని కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన నివేదికలో ప్రస్తావించింది. 

గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 2016–17 నుంచి 2020–21 మధ్య.. న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్, నేషనల్‌ ఇన్సూరెన్స్‌ రూ.26,334 కోట్లు నష్టపోయినట్టు తెలిపింది. ఈ సంస్థలకు ఆరోగ్య బీమా రెండో అతిపెద్ద వ్యాపారంగా ఉందంటూ.. సంబంధిత ఐదు సంవత్సరాల్లో రూ.1,16,551 కోట్ల స్థూల ప్రీమియం ఆదాయం వచ్చినట్టు పేర్కొంది. 

ఆరోగ్య బీమా మార్కెట్లో ఇవి క్రమంగా తమ వాటాను ప్రైవేటు సంస్థలకు కోల్పోతున్నట్టు ప్రస్తావించింది. బీమా వ్యాపారానికి సంబంధించి నిర్ధేశిత అండర్‌ రైటింగ్‌ (క్లెయిమ్‌లకు సంబంధించి) నిబంధనలను ఇవి అనుసరించడం లేదని కాగ్‌ గుర్తించింది. ‘‘స్టాండలోన్‌ గ్రూప్‌ పాలసీలకు కంబైన్డ్‌ రేషియో 95 శాతం మించకూడదు. క్రాస్‌ సబ్సిడీ ఉన్న గ్రూపు పాలసీలకు 100 శాతం మించకూడదు. కానీ, గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ల కంబైన్డ్‌ రేషియో 125–165 శాతం మధ్య ఉంది. ఈ సంస్థల్లోని ఐటీ వ్యవస్థల నుంచి సరైన తనిఖీలు, నియంత్రణలు లోపించాయి’’అని వెల్లడించింది.    

మరిన్ని వార్తలు