రూపాయిలో ట్రేడింగ్‌.. భారత్‌ ‘జీ 20’ అజెండా

28 Mar, 2023 00:20 IST|Sakshi

వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌

ముంబై: భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న జీ–20 సమావేశాల్లో ‘రూపాయిలో ట్రేడింగ్‌’  అజెండాను ముందుకు తీసుకువెళ్లాలని కేంద్రం భావిస్తోందని, ఇందుకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తోందని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా కరెన్సీ ఒత్తిడిలో ఉన్న దేశాలకు రూపాయి వాణిజ్యం ఉపయోగపడుతుందని వాణిజ్య కార్యదర్శి ఇక్కడ విలేకరులతో  అన్నారు. అయితే జీ–20 ఫోరమ్‌తో రూపాయి వాణిజ్యానికి నేరుగా సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

ముంబైలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న కీలక సమావేశం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీ–20 దేశాలు, ప్రత్యేక ఆహ్వానితులుసహా దాదాపు 100 మంది ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ సమావేశం చర్చించే అంశాల్లో వాణిజ్యం– వృద్ది మధ్య మరింత సమతౌల్యత సాధించడం, ప్రపంచ సరఫరాల చైన్‌ను ఆటుపోట్లను తట్టుకునేలా చర్యలు తీసుకోవడం, వాణిజ్యంలో చిన్న వ్యాపారాలను ఏకీకృతం చేయడం, నిబంధనలలో ఏకరూపత సాధించడం, తద్వారా లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడానికి మార్గాలు వంటి అంశాలు ఉన్నాయని బరŠాత్వల్‌ చెప్పారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు సంబంధించి భారత్‌ కొన్ని  సంస్కరణలను ప్రతిపాదిస్తున్నదని పేర్కొన్న వాణిజ్య కార్యదర్శి, గుజరాత్‌లోని కెవాడియాలో జరిగే వాణిజ్య, పెట్టుబడి వర్కింగ్‌ గ్రూప్‌ తదుపరి సమావేశ ఎజెండాలో ఇదే ప్రధాన అంశమని  తెలిపారు.   రూపాయి మారకంలో అంతర్జాతీయంగా  ట్రేడింగ్‌ కార్యకలాపాలు నిర్వహించడంపై ఇతర దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు సంబంధించి 18 దేశాలకు చెందిన బ్యాంకులు.. భారతీయ బ్యాంకుల్లో 30 పైచిలుకు ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. లావాదేవీలూ  స్వల్ప స్థాయిలో ప్రారంభమైనట్లు వివరించారు. రూపాయి మారకంలో చెల్లింపుల సెటిల్మెంట్‌కు వోస్ట్రో ఖాతాలు దోహదపడతాయి. రూపాయల్లో వాణిజ్యానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్‌బీఐ గతేడాది జూలైలో ప్రకటించిన తర్వాత తొలుత రష్యాకు చెందిన సిబెర్‌ బ్యాంక్, వీటీబీ బ్యాంక్‌ ఈ ఖాతాలు తెరిచాయి. 

మరిన్ని వార్తలు