కట్టడిలో ద్రవ్యలోటు.. ఇండియా రేటింగ్స్‌ నివేదిక

31 Dec, 2021 07:48 IST|Sakshi

కలసివస్తున్న భారీ ఆదాయాలు

మంత్రిత్వ శాఖల తక్కువ వ్యయాలూ కారణమే   

ముంబై: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) లక్ష్యం కన్నా తక్కువగా 6.6 శాతంగానే నమోదవుతుందన్న అభిప్రాయాన్ని ఇండియా రేటింగ్స్‌ నివేదిక వ్యక్తం చేసింది. ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలు ప్రకటించినప్పటికీ ద్రవ్యలోటు కట్టుతప్పదని విశ్లేషించింది. ఆదాయాలు బాగుండడం, వివిధ మంత్రిత్వశాఖల తక్కువ వ్యయాలు దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది.

కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్యలోటు 9.3 (లక్ష్యం 3.5 శాతం) శాతంగా నమోదయ్యింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీనిని 6.8 శాతం (రూ.15.06 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని 2021–22 బడ్జెట్‌ నిర్దేశించింది. ద్రవ్యలోటు అక్టోబర్‌ ముగిసే నాటికి రూ. 5,47,026 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 బడ్జెట్‌ అంచనాల్లో (బడ్జెట్‌ అంచనా రూ.15.06 లక్షల కోట్లు) ఇది 36.3 శాతం. ఆర్‌బీఐసహా పలు విశ్లేషణా సంస్థలు 6.8 శాతం వద్ద ద్రవ్యలోటు కట్టడి కష్టమని విశ్లేషిస్తున్న నేపథ్యంలో ఇండియా రేటింగ్స్‌ తాజా ప్రకటన చేయడం గమనార్హం. బడ్జెట్‌ అంచనాలను మించి పన్ను వసూళ్లు రూ.5.9 లక్షల కోట్లుగా నమోదవుతాయని ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది.  2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్‌ 2021–22 బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.


చదవండి:100 ట్రిలియన్‌ డాలర్లకి చేరుకోనున్న ప్రపంచ ఎకానమీ

మరిన్ని వార్తలు