మైక్రోఫైనాన్స్‌ రంగానికి మంచి రోజులు

18 Feb, 2023 07:30 IST|Sakshi

ముంబై: సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐ) కరోనా సమయంలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ నుంచి బయటకు వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి క్రెడిట్‌ వ్యయాలు తక్కువ స్థాయికి చేరుకుంటాయని, ప్రస్తుతం ఇవి మంచి వృద్ధిని చూస్తున్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ తన తాజా నివేదికలో తెలిపింది.

మైక్రోఫైనాన్స్‌ రంగానికి అవుట్‌లుక్‌ను తటస్థం నుంచి ‘మెరుగుపడుతున్నట్టు’గా మార్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) స్థిరమైన రేటింగ్‌ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ రుణ పరిశ్రమ 20–30 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సమసిపోవడంతో మరింత మంది రుణాల కోసం ముందుకు వస్తున్నట్టు తెలిపింది.

రుణ వసూళ్లు మెరుగుపడడం, రుణ వితరణలు పెరగడం, క్రెడిట్‌ వ్యయాలు 15–5 శాతం నుంచి 1–3 శాతానికి దిగి రావడం అనుకూలించే అంశాలుగా పేర్కొంది. సూక్ష్మ రుణ సంస్థలు కరోనా మహమ్మారికి సంబంధించి ప్రతికూలతలను దాదాపుగా డిసెంబర్‌ త్రైమాసికానికి సర్దుబాటు చేసుకున్నట్టు వివరించింది. రుణ వితరణలు పెరుగుతుండడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి నమోదు కావచ్చని తెలిపింది.  

రెండు రిస్క్‌లు 
వచ్చే 12–18 నెలల కాలంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్క్‌లు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్‌ నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణం, ఎన్నికలను ప్రస్తావించింది. ఈ రెండు అంశాలు 2023–24తోపాటు, 2024–25 మొదటి ఆరు నెలలు రుణ గ్రహీతల ఆదాయంపై  ప్రభావం చూపించొచ్చని అంచనా వేసింది. రుణాల ఎగవేతలు, క్రెడిట్‌ వ్యయాలు సాధారణ స్థాయికి వస్తా యని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థల రుణాల్లో అధిక శాతం కరోనా మహమ్మారి తర్వాత జారీ అయినవేనని, వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని వివరించింది. మొత్తం మీద క్రెడిట్‌ వ్యయాలు 2022– 23లో 1.5–5 శాతం మధ్య ఉంటే, 2023–24లో 1–3 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. ముఖ్యంగా ఎంఎఫ్‌ఐల రుణ గ్రహీతల్లో 65 శాతం నిత్యావసర వస్తువులు, సేవల్లోనే ఉపాధి పొందుతున్నందున, వీరిపై ద్రవ్యోల్బణం ప్రభావం అధికంగా పడుతుందని, వారి ఆదాయం, వ్యయాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు