వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

23 Nov, 2021 19:28 IST|Sakshi

రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలను తగ్గించడం కోసం అమెరికా, జపాన్ వంటి ఇతర దేశాల తరహాలోనే అత్యవసర వ్యూహాత్మక నిల్వ కేంద్రాల నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును వెలికి తీయాలని భారతదేశం యోచిస్తున్నట్లు ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని అన్నారు. భారతదేశం, జపాన్‌తో సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థ గల దేశాల సహకారంతో ముడి చమురు అత్యవసర స్టాక్‌ను విడుదల చేయడానికి అమెరికా ప్రణాళిక వేసింది. 

దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరంలో మూడు ప్రదేశాలలో ఉన్న భూగర్భ చమురు కేంద్రాలలో సుమారు 38 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును నిల్వ చేస్తుంది. ఇందులో నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ విడుదల చేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ 7-10 రోజులలో ప్రారంభం కానున్నట్లు ఆ అధికారి తెలిపారు. వ్యూహాత్మక నిల్వలకు పైప్ లైన్ ద్వారా అనుసంధానించిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్‌)లకు స్టాక్స్ విక్రయించనున్నారు. 

(చదవండి: ప్ర‌పంచంలో అత్య‌ధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!)

భారత్, అమెరికా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా వంటి దేశాలు ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురు ఒకేసారి బయటకి తీయడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురును విడుదల చేయాలని అమెరికా ఈ దేశాలను కోరినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చమురు ఉత్పత్తి దేశాలు కావాలనే కృత్రిమ సృష్టించడం పట్ల భారతదేశం పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ధరలు పెరగడం, ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది అని ఒక ప్రకటనలో గతంలో తెలిపింది.

(చదవండి: 5 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల ప్లేబ్యాక్‌ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసిన సౌండ్‌కోర్‌..!)

మరిన్ని వార్తలు