చమురు ధరలకు భారత్‌ చెక్‌!

24 Nov, 2021 04:29 IST|Sakshi

దేశ చరిత్రలోనే తొలిసారి..

అమెరికా, చైనా, జపాన్‌ బాటలో ప్రభుత్వం

5 మిలియన్‌ బ్యారళ్ల విడుదలకు ప్రణాళిక

ఎంఆర్‌పీఎల్, హెచ్‌పీసీఎల్‌ ద్వారా రిలీజ్‌

50 మిలియన్‌ బ్యారళ్ల సరఫరాకు యూఎస్‌ రెడీ

న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా మండుతున్న ముడిచమురు ధరలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు వీలుగా అత్యవసర వినియోగానికి పక్కనపెట్టే చమురు నిల్వల నుంచి 5 మిలియన్‌ బ్యారళ్లను విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా యూఎస్, చైనా, జపాన్‌ బాటలో నడవనుంది. దేశ చరిత్రలోనే తొలిసారి కేంద్ర ప్రభుత్వం 3.8 కోట్ల బ్యారళ్ల(5.33 మిలియన్‌ టన్నులు) ముడిచమురును నిల్వ చేసింది.

ఇందుకు తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో ఏర్పాటు చేసిన భూగర్భ బిలాలను వినియోగించుకుంది. వీటి నుంచి తాజాగా నిర్ణయించిన 5 మిలియన్‌ బ్యారళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 1.33 మిలియన్‌ టన్నులు, కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్‌ టన్నులు, పాడూర్‌లో 2.5 మిలియన్‌ టన్నులు చొప్పున చమురు స్టోరేజీలున్నాయి. కాగా.. దేశీయంగా రోజుకి 4.8 మిలియన్‌ బ్యారళ్ల చమురును వినియోగిస్తుండటం గమనార్హం!

అమెరికా రెడీ
ప్రపంచ ఇంధన ధరలు తగ్గేందుకు వీలుగా నిల్వల నుంచి చమురును విడుదల చేయవలసిందిగా గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో గత వారం యూఎస్‌ ప్రభుత్వం అభ్యర్థించింది. ఇందుకు ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు చైనా, ఇండియా, జపాన్‌ తదితరాలనుద్ధేశించి కలసికట్టుగా వ్యవహరించాలంటూ సూచించింది. చమురు ఉత్పత్తిని పెంచమంటూ పలుమార్లు చేసిన అభ్యర్థనలను పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్‌), తదితర దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో యూఎస్‌ వినియోగ దేశాలకు చమురు విడుదలకు సూచించింది.

ఇందుకు మార్గదర్శకత్వాన్ని వహిస్తూ 50 మిలియన్‌ బ్యారళ్లను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ బాటలో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వుల నుంచి 5 మిలియన్‌ బ్యారళ్ల విడుదలకు భారత్‌ సైతం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇతర ప్రధాన వినియోగ దేశాలతో చర్చల ద్వారా భారత్‌ ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వివరించాయి. చమురు వినియోగంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో పెద్ద దేశంగా నిలుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా 72.7 కోట్ల బ్యారళ్ల చమురును నిల్వ చేయగా.. జపాన్‌ 17.5 కోట్ల బ్యారళ్ల చమురును రిజర్వులో ఉంచుతోంది.   

సహేతుకంగా
లిక్విడ్‌ హైడ్రోకార్బన్ల ధరలు సహేతుకంగా, బాధ్యతాయుతంగా ఉండాలని బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మార్కెట్‌ శక్తులు ధరలను నిర్ణయించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. చమురు ఉత్పాదక దేశాలు డిమాండ్‌ కంటే తక్కువగా సరఫరాలను కృత్రిమంగా సర్దుబాటు చేయడంపై పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేసింది. ఇది ధరల పెంపునకు దారితీస్తున్నట్లు పేర్కొంది. అయితే చమురు విడుదల తేదీని వెల్లడించనప్పటికీ రానున్న 7–10 రోజుల్లోగా నిర్ణయానికి వీలున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మక రిజర్వుల నుంచి పైపులైన్లు కలిగిన మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌(ఎంఆర్‌పీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్ప్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)కు చమురును విక్రయించనున్నట్లు పేర్కొన్నాయి.

అమెరికా ప్రకటన...
వాషింగ్టన్‌: దేశ వ్యూహాత్మక రిజర్వుల నుంచి 5 కోట్ల బ్యారళ్ల చమురు విడుదలకు యూఎస్‌ అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా నిర్ణయించినట్లు వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. తద్వారా అమెరికన్ల ఇంధన వ్యయాలను తగ్గించనున్నట్లు తెలియజేసింది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఇండియా, జపాన్, చైనా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, యూకేలతో సంప్రదింపుల తదుపరి బైడెన్‌ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడుతున్న సమయంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి ఇతర దేశాలతో బైడెన్‌ చర్చలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఈ అంశంపై కొద్ది వారాలుగా ఇతర దేశాలతో నిర్వహిస్తున్న చర్చలు వెల్లడవుతున్న నేపథ్యంలో ధరలు 10% దిగివచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేసింది. ఇటీవల గ్యాస్‌ ధరలు గ్యాలన్‌కు 3.4 డాలర్లను తాకినట్లు పేర్కొంది. ఇది ఏడాదిక్రితం ధరలతో పోలిస్తే 50% అధికమని తెలియజేసింది.

ధరలు దిగివస్తాయ్‌..
ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు యూఎస్, చైనా, భారత్‌ తదితరాలు చేతులు కలపడంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు దిగివచ్చే అవకాశమున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాల్లో కోతలకు వ్యతిరేకంగా యూఎస్, భారత్‌ అత్యవసర నిల్వల నుంచి చమురును దేశ వ్యవస్థలలోకి విడుదల చేయనుండటంతో ధరలకు కొంతమేర చెక్‌ పడే వీలున్నట్లు తెలియజేశాయి. చమురు సరఫరాలు పెరిగితే.. దిగుమతులను తగ్గించుకోవలసి ఉంటుంది. దీంతో ముడిచమురుకు తాత్కాలికంగా డిమాండ్‌ తగ్గనుంది.

వెరసి ధరలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు కోవిడ్‌–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడం పలు దేశాలలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు యూఎస్‌ ప్రభుత్వం తాజాగా వ్యాఖ్యానించింది. డిమాండుకు తగిన రీతిలో సరఫరాలను పెంచమంటూ చమురు ఉత్పత్తి, ఎగుమతి(ఒపెక్‌) దేశాలను అభ్యర్థించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇంధన వినియోగ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు ఏకంకావడంతో ధరలు బలహీనపడే అవకాశమున్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  
 

మరిన్ని వార్తలు