దిగివచ్చిన ఆహార ధరలు

14 Sep, 2021 03:14 IST|Sakshi

అదుపులోకి రిటైల్‌ ద్రవ్యోల్బణం

ఆగస్టులో 5.3 శాతం

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం స్పీడ్‌ ఆగస్టులో మరింత తగ్గింది. 5.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోలి్చతే రిటైల్‌ ఉత్పత్తుల బాస్కెట్‌ ధర 5.3 శాతం పెరిగిందన్నమాట. 2020 ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.69 శాతం ఉంటే, 2021 జూలైలో 5.59 శాతంగా ఉంది. సంబంధిత రెండు నెలలతో పోల్చితే ధరల స్పీడ్‌ తాజా సమీక్షా నెల 2021 ఆగస్టులో కొంత తగ్గిందన్నమాట. ఆహార ఉత్పత్తుల ధరలు కొంత తగ్గడం దీనికి ప్రధాన కారణమని సోమవారం వెలువడిన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) లెక్కలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  

కీలక విభాగాలు ఇలా
► ఆహార బాస్కెట్‌ ద్రవ్యోల్బణం 2021 ఆగస్టులో 3.11 శాతంగా ఉంది. ఇది జూలైలో 3.96 శాతం.  
► కూరగాయల ధరలు 11.7 శాతం తగ్గాయి.  
► పప్పు దినుసులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 1.42 శాతం దిగివచ్చాయి.  
► అయితే ఆయిల్స్‌  అండ్‌ ఫ్యాట్స్‌ విషయంలో ధరలు ఏకంగా 33 శాతం ఎగశాయి.  
► ఇంధనం, విద్యుత్‌ విషయంలో ద్రవ్యోల్బణం 13 శాతంగా ఉంది.  
► సేవల ద్రవ్యోల్బణం 6.4 శాతం.  

2–6 శ్రేణి లక్ష్యం...
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో నిర్ణయానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2 నుంచి 6 శాతం మధ్య ఈ రేటు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. 2020 హైబేస్‌ నేపథ్యంలో 2021 ఏప్రిల్‌లో 4.29 శాతంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ సరఫరాల సమస్య తీవ్రత నేపథ్యంలో మే, జూన్‌ నెలల్లో వరుసగా 6.3 శాతం, 6.26 శాతాలకు పెరిగింది. జూలైలో కొంత తగ్గి 5.59 శాతంగా ఉంది.  2021–22లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 5.7 శాతం ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనా. 

సగటున  రెండవ త్రైమాసికంలో 5.9 శాతం, మూడవ త్రైమాసికంలో 5.3 శాతం, నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2022–23లో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని ఆర్‌బీఐ ప్రస్తుతం భావిస్తోంది. 2020 మార్చి తర్వాత 115 బేసిస్‌ పాయింట్ల రెపో రేటును తగ్గించిన గవర్నర్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ పాలసీ సమీక్షా కమిటీ,  గడచిన ఏడు ద్వైమాసిక సమీక్షా సమావేశాల నుంచి రెపో రేటును యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది.  ద్రవ్యోల్బణం కట్టడి జరుగుతుందన్న అంచనాలు, వృద్ధికి ఊపును అందించాల్సిన ఆవశ్యకత నేపథ్యంలో సరళతర రేట్ల విధానానికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు