భారత్‌కు రష్యా క్రూడ్‌.. 50 రెట్లు అప్‌

24 Jun, 2022 06:22 IST|Sakshi

ఏప్రిల్‌ నుంచి భారీగా పెరిగిన దిగుమతులు

న్యూఢిల్లీ: భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు ఏప్రిల్‌ నుండి దాదాపు 50 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొత్తం క్రూడాయిల్‌ పరిమాణంలో 10 శాతానికి చేరాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి దిగడానికి ముందు ఆ దేశం నుంచి భారత్‌కు చమురు దిగుమతులు 0.2 శాతం మాత్రమే ఉండేవి. రష్యా ప్రస్తుతం టాప్‌ 10 సరఫరా దేశాల్లో ఒకటిగా మారిందని సీనియర్‌ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్‌ రిఫైనరీ సంస్థలు దాదాపు 40 శాతం మేర రష్యన్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

మేలో దేశీ రిఫైనర్లు 2.5 కోట్ల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఇక, ఏప్రిల్‌ నెలకు చూస్తే సముద్రమార్గంలో భారత్‌కు వచ్చే మొత్తం దిగుమతుల్లో రష్యన్‌ క్రూడాయిల్‌ వాటా 10 శాతానికి పెరిగింది. ఇది 2021 ఆసాంతం, 2022 తొలి త్రైమాసికంలో 0.2 శాతమే. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో తమ ముడిచమురును డిస్కౌంటుకే రష్యా విక్రయిస్తోంది. క్రూడాయిల్‌ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే తిరుగాడుతున్న తరుణంలో 30 డాలర్ల వరకూ డిస్కౌంటు లభిస్తుండటంతో దేశీ రిఫైనర్లు పెద్ద ఎత్తున రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు