భారత్‌లో సైబర్‌ భద్రత, గోప్యత బలహీనం 

25 Feb, 2023 04:02 IST|Sakshi

సత్వరమే వీటిపై దృష్టి పెట్టాలి 

ఇంటర్నెట్, ఆవిష్కరణల్లో ముందు 

ఐసీఆర్‌ఐఈఆర్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ ఆవిష్కరణలు, వాటిని ఉపయోగించుకోవడంలో భారత్‌ ఎంతో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ఐసీఆర్‌ఐఈఆర్‌ విడుదల చేసిన భారత డిజిటల్‌ ఎకనామీ నివేదిక తెలిపింది. కానీ, సైబర్‌ భ్రదత, గోప్యత విషయంలో భారత్‌ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నట్టు పేర్కొంది. ప్రత్యేకంగా సైబర్‌ భద్రత చట్టం లేకపోవడం వల్ల, భారతీయులు ఆయా రంగాల నిబంధనలపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది.

అసాధారణ స్థాయిలో డిజిటల్‌ పరివర్తన చూపిస్తున్న భారత్‌లో, సైబర్‌ భద్రత బలహీనంగా ఉన్నట్టు అభిప్రాయడింది. భారత్‌లో ఆవిష్కరణలు, డిజిటల్‌ సేవల సామర్థ్యాలను వినియోగించుకునే తీరుపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. ఇంటరెŠన్ట్‌ను ఉపయోగించుకుని, వృద్ధి చెందడం, ఉపాధి కల్పన, పరిపానాల మెరుగుదల అంశాలు ఏ విధంగా ఉన్నాయన్నది విశ్లేషించింది. ‘‘జీ20లోని తోటి దేశాలతో పోలిస్తే తక్కువ మధ్యాదాయం కలిగిన దేశం భారత్‌.

కానీ, ఆవిష్కరణల్లో మాత్రం భారత్‌ ఎంతో ఉన్నత స్థానంలో ఉంది. భారతీయులు త్వరితగతిన డిజిటల్‌ సేవలను వినియోగించుకోవడం తదుపరి వృద్ధిని వేగవంతం చేస్తుంది’’అని ఈ నివేదిక వివరించింది. సైబర్‌ నేరాలు, గోప్యతపై దాడి ఈ రెండు అంశాలపై భారత్‌ అత్యవసరంగా దృష్టి సారించాల్సి ఉందని సూచించింది.

డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు ద్వారా ఈ అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపింది. సైబర్‌ దాడుల నుంచి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు భారత్‌ ఎంతో చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్‌లో డిజిటైజేషన్‌ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ.. సైబర్‌ భద్రత కవచాలు ఏర్పాటు చేసుకోవడంలో మోస్తరు పురోగతినే చూపించినట్టు స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు