సానుకూలమైనా... సవాళ్లూ ఉన్నాయ్‌!

23 May, 2023 06:27 IST|Sakshi

భారత్‌ ఎకానమీపై ఆర్థిక మంత్రిత్వశాఖ నివేదిక  

న్యూఢిల్లీ: భారత్‌ ఎకానమీ 2023–24 మొదటి నెల– ఏప్రిల్‌లో శుభారంభం చేసిందని ఆర్థికశాఖ ఏప్రిల్‌ నెలవారీ సమీక్షా నివేదిక  పేర్కొంది. అయితే భారత్‌ వృద్ధి బాటకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం సవాళ్లు పొంచి ఉన్నాయని పేర్కొంది. వినియోగం స్థిరంగా ఉండడం  విస్తృత ప్రాతిపదికన  వృద్ధి నమోదుకావడానికి దోహదపడే అంశమైనా, పెట్టుబడుల్లో సామర్థ్యం సృష్టి, రియల్టీలో పెట్టుబడులు వంటి అంశాలపై అనిశ్చితి ఉందని పేర్కొంది. దేశీయంగా అన్నీ సానుకూల అంశాలేనని పేర్కొంటున్న నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే..

ఆర్థిక సంవత్సరం శుభారంభం
మొత్తం సంవత్సరానికి ఆర్థిక ఫలితాలను అంచనా వేయడానికి ఏప్రిల్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అయితే ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను తీసుకుంటే, ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలతోనే ప్రారంభమైందని భావించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ని పరిగణనలోకి తీసుకోవాలి. జీఎస్‌టీ వసూళ్లు ఏప్రిల్‌లో రికార్డు సృష్టించాయి. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. అన్ని పరోక్ష పన్నులనూ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ, 2017 జూలైలో కొత్త పన్ను విధానం ప్రారంభంమైన తర్వాత ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. 2022 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 12 శాతం పెరిగాయి.  రికార్డు స్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు ప్రశంసనీయం.  ఆర్థిక వ్యవస్థకు ఇది శుభ వార్త. తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ,  పన్నుల వసూళ్లు నెలవారీగా ఈ స్థాయికి పెరగడం జీఎస్‌టీ పట్ల వ్యవస్థలో పెరిగిన విశ్వాసాన్ని, ఆమోదనీయోగ్యతను, సమ్మతిని సూచిస్తోంది. భారత్‌ ఎకానమీ పటిష్ట పురోగతిని ఇది సూచిస్తోంది.  

ఐఐపీ భరోసా
గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసింకంలో (2022–23 జనవరి–మార్చి) పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ) అందులో దాదాపు 44 వెయిటేజ్‌ ఉన్న ఎనిమిది పరిశ్రమల కీలక గ్రూప్‌ ( క్రూడ్‌ ఆయిల్, విద్యుత్, సిమెంట్, బొగ్గు, ఎరువులు, స్టీల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టŠస్‌ ) స్థిరమైన వృద్ధి తీరును కనబరిచాయి. అంతక్రితం రెండు త్రైమాసికాలతో పోల్చితే (జూలై–డిసెంబర్‌) వినియోగ సామర్థ్యం 75 శాతం పెరిగింది. కార్యకలాపాలలో స్థిరమైన వృద్ధి, సామర్థ్య వినియోగం పెరుగుదల సానుకూలతలతో కార్పొరేట్‌లు కొత్త  పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. భారీ యంత్రసామాగ్రి డిమాండ్, ఉత్పత్తికి సంబంధించిన క్యాపిటల్‌ గూడ్స్, నిర్మాణ రంగాలు 4వ త్రైమాసికంలో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. మూలధన వస్తువుల దిగుమతుల్లోనూ పెరుగుదల నమోదయ్యింది.  

సేవలు, తయారీ, వ్యవసాయమూ.. ప్లస్సే...
తయారీ, సేవల రంగం మాదిరిగానే వ్యవసాయ రంగానికి కూడా అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సాధారణ రుతుపవనాల అంచనా, మిగులు నీటి నిల్వ స్థాయిలు, విత్తనాలు– ఎరువులు తగినంత లభ్యత, పటిష్టమైన ట్రాక్టర్‌ విక్రయాలు జూన్‌ 2023 నుండి ప్రారంభమయ్యే  ఖరీఫ్‌ విత్తన సీజన్‌కు శుభసూచికలు.  అకాల వర్షాలు నమోదవుతున్నప్పటికీ, గోధుమల సేకరణ సజావుగా సాగుతోంది. ఇది  ఆహార భద్రతకు ఊతమిస్తోంది.  గ్రామీణ డిమాండ్‌ కూడా ఊపందుకుంటోంది. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సూ్యమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీల అమ్మకాలు పటిష్టంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలలో అంకెల వృద్ధి నమోదయ్యింది. ఖరీఫ్‌ సీజన్‌కు మంచి అవకాశాలు, పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) పెరగడం, ప్రభుత్వం బడ్జెట్‌లో పెంచిన వ్య యం రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు  గ్రా మీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశం ఉంది.  

ద్రవ్యోల్బణం అదుపులోకి...
18 నెలల పాటు రెండంకెల్లో పయనించిన టోకు ద్రవ్యోల్బణం ప్రస్తుతం పూర్తిగా అదుపులోనికి వచ్చింది. ఏప్రిల్‌లో 33 నెలల కనిష్ట స్థాయిలో –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక నవంబర్, డిసెంబర్‌ మినహా 2022 నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి  కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కట్టడి పైన కొనసాగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చింది. ముడి పదార్థాల తగ్గుదలను ఇది సూచిస్తోంది. ఖరీఫ్‌ దిగుబడుల భారీ అంచనాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చే అవకాశం ఉంది.  

ఎగుమతులు భేష్‌...
తీవ్ర పోటీ, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్‌ ఎగుమతులు మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. ప్రొడక్ట్‌ లింక్డ్‌ స్కీమ్‌ (పీఎల్‌ఐ) మద్దతుతో భారత్‌  నుండి వస్త్ర, రెడీమేడ్‌ వస్త్రాల ఎగుమతులు కూడా భారీగా పెరుగుతున్నాయి. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల పునరేకీకరణ, కొత్త మార్కెట్‌లకు అనుగుణంగా శుద్ధి చేసిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి.  

మరిన్ని వార్తలు