ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనాకు పోటీగా భారత్ దూకుడు!

4 Oct, 2021 19:07 IST|Sakshi

దేశంలో ఈ మధ్య కాలంలో కొత్త వాహనం కొనేవారికి పెట్రోల్ వాహనం కొనాలా? లేదా ఎలక్ట్రిక్ వాహనం కొనాలా అనే ప్రశ్న ఎదురు అవుతుంది. ఏడాది కాలంలోనే అంత వేగంగా విస్తరించింది ఎలక్ట్రిక్ వాహన రంగం. రాబోయే కాలంలో భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రధాన మార్కెట్ కావచ్చు. ఈవీల డిమాండ్ రాబోయే ఆరు నెలల్లో 15 రెట్లు పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు దేశంలో దూసుకెళ్తున్నాయి. అయితే, మన దేశంలో ఇంత వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.

పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ ఈవీ ధరలు, ప్రభుత్వ మద్దతు & ప్రోత్సాహకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పెరగడంతో ఈ ఆకస్మిక పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. చమురు ధరలు తగ్గినప్పటికీ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరిగాయి. గ్యాసోలిన్, డీజిల్ రెండింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల పెరుగుదల కారణంగా ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో రవాణా, షిప్పింగ్ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఇంధన ధరల పెరుగుదలతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. (చదవండి: ఈ 26 యాప్స్‌పై గూగుల్ నిషేధం..ఇవి చాలా డేంజర్!)

2020లో ప్రపంచం నావెల్ కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్నప్పటికీ అంతర్జాతీయ ఇంధన సంస్థ 2021 గ్లోబల్ ఈవీ అవుట్ లుక్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సు రిజిస్ట్రేషన్లు 34 శాతం పెరిగాయి. అదే సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు రెండూ ఈవిలపై భారీగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. గత కొద్ది నెలల నుంచి ఈవీ అమ్మకాల్లో చైనాతో పోటీగా భారత్ దూసుకెళ్తుంది. విదేశీ ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం, దేశంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈవీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం భారత వాణిజ్య ఈవీ రంగం చిన్నదిగా ఉంది. కానీ, త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు అండగా మారే అవకాశం ఉంది. (చదవండి: పెట్రోల్‌ సెంచరీ..మరీ ఈవీ ఛార్జింగ్‌ కాస్ట్‌ ఎంతో తెలుసా ?)

ప్రపంచ EV30@30 ప్రచారం కోసం సంతకం చేసిన కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. ఈ దేశాలు 2030 నాటికి ప్రతి 20 కొత్త కార్ల అమ్మకాలలో 3 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకే. ఈ ఏడాదిలోనే భారత దేశ మంత్రివర్గం ఐదు సంవత్సరాల వ్యవధిలో సుమారు 3.5 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. ఇది ఈవిల(బ్యాటరీ, ఫ్యూయల్ సెల్ వాహనాలు రెండూ) అలాగే దేశీయ డ్రోన్ల తయారీకి వెళుతుంది. ఈ నిర్ణయం ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో భారతదేశం పోటీగా మారడానికి, కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుందని భారత ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు