భారత్‌కు మాల్‌వేర్‌ ముప్పు.. సైబర్‌సెక్యూరిటీ సంస్థ నివేదికలో కీలక విషయాలు

30 May, 2023 07:44 IST|Sakshi

న్యూఢిల్లీ: మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు మాల్‌వేర్‌పరమైన ముప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022లో ఇవి ఏకంగా 31 శాతం ఎగిశాయి. అలాగే రాన్‌సమ్‌వేర్‌ దాడులు 53 శాతం పెరిగాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ సోనిక్‌వాల్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

భారత్‌ వంటి దేశాల్లో సైబర్‌ నేరగాళ్లు తమ దాడుల పరిధిని మరింతగా పెంచుకుంటున్నారని, కొత్త టార్గెట్లను ఎంచుకోవడం, కొంగొత్త విధానాలు అమలు చేస్తున్నారని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ దేబాశీష్‌ ముఖర్జీ తెలిపారు. వారు అవకాశాల కోసం నిరంతరం అన్వేషిస్తూ, ఒకసారి విజయవంతమైతే మళ్లీ మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారని వివరించారు. ఈ నేపథ్యంలో కంపెనీలకు సైబర్‌ నేరగాళ్ల వ్యూహాలను ఆకళింపు చేసుకుని, వారి దాడులను ఎదుర్కొనగలిగే నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా సైబర్‌ సెక్యూరిటీ మార్కెట్‌ 2022లో 173.5 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 8.9 శాతం వృద్ధి చెందుతూ 2027 నాటికి 266.2 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనాలు ఉన్నాయి. సోనిక్‌వాల్‌ సర్వీసులు అందించే క్లయింట్లలో 55 శాతం పెద్ద సంస్థలు ఉండగా, 45 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలు ఉన్నాయి.

ఇదీ చదవండి: టెక్నో కామన్‌ 20 సిరీస్‌ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం!

మరిన్ని వార్తలు