సరికొత్త సంచలనం.. ప్రపంచంలో ఐదో ఆర్ధిక శక్తిగా భారత్‌!

26 Feb, 2023 04:20 IST|Sakshi

వినూత్న ఆవిష్కరణల్లో భారత్‌ బలహీనం 

ప్రపంచ టాప్‌ 5 ఆర్థిక వ్యవస్థల్లో మన దేశానికి చోటు 

జీడీపీలో నంబర్‌ 1 అమెరికా.. వినూత్న సూచీలో నంబర్‌ 2  

(ఎం. విశ్వనాధరెడ్డి, సాక్షి ప్రతినిధి): బలీయమైన ఆర్థిక శక్తిగా టాప్‌–5 దేశాల జాబితాలో చేరి భారత్‌ సంచలనం సృష్టించింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వస్తు, సేవల ఉత్పత్తి విలువ కోటి కోట్ల డాలర్లు దాటింది. ఇందులో 3.5 లక్షల కోట్ల డాలర్ల వాటాతో భారత్‌ ఐదో స్థానాన్ని దక్కించుకుని బ్రిటన్‌ను ఆరో స్థానానికి పరిమితం చేసింది.

భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని కావడం యాదృచ్ఛికం. బలీయమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా వినూత్న ఆవిష్కరణల సూచీలో మాత్రం భారత్‌ వెనుకంజలో ఉంది. బలం పుంజుకున్న ఆర్థిక వ్యవస్థకు వినూత్న ఆవిష్కరణలు తోడైతే భారత్‌ అద్భుతాలు సాధిస్తుందని మేధావులు పేర్కొంటున్నారు. ఈ దిశగా అడుగులు వేసి పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.  

జీడీపీలో సగం వాటా 5 దేశాలదే 
2022లో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల మొత్తం స్థూల ఉత్పత్తి కోటి కోట్ల డాలర్ల (100 ట్రిలియన్‌ డాలర్స్‌) మార్క్‌ దాటింది. ఇందులో 51 శాతం జీడీపీ అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్‌ నుంచే ఉంది.  ఇక టాప్‌ 10 దేశాల్లో 66 శాతం జీడీపీ ఉంది. 84 శాతం టాప్‌ 25 దేశాల్లో ఉంది. మిగతా 167 దేశాల్లో కలిపి 16 శాతం మాత్రమే జీడీపీ ఉంది. 

అగ్రస్థానంలో స్విట్జర్లాండ్‌  
జీడీపీలో 22వ స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌ ప్రపంచ వినూత్న ఆవిష్కరణల సూచీలో పుష్కరకాలంగా తొలి స్థానంలో నిలుస్తోంది. ఇన్నోవేటివ్‌ ఇండెక్స్‌లో 64.6 స్కోరుతో 2022లో తొలిస్థానంలో నిలిచింది. 61.8 స్కోరుతో రెండో స్థానంలో ఉన్న అమెరికా పరిశోధన–అభివృద్ధిపై ఏటా 70 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పరిశోధన, అభివృద్ధిపై భారీగా వ్యయం చేస్తున్న నాలుగు కంపెనీలు అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, యాపిల్‌ అమెరికాలోనే ఉండటం గమనార్హం. ఐరాస రూపొందించిన వినూత్న ఆవిష్కరణల సూచీలో మన దేశానికి 40వ స్థానం దక్కింది. 36.6 పాయింట్ల స్కోరుతో భారత్‌ 40వ స్థానంలో ఉంది. జీడీపీలో రెండోస్థానంలో ఉన్న చైనా 55.3 పాయింట్ల స్కోరుతో వినూత్న సూచీలో 11వ స్థానంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు