సెప్టెంబర్‌లో సేవలపై ద్రవ్యోల్బణ భారం

7 Oct, 2022 07:23 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం సెప్టెంబర్‌లో ఆరు నెలల కనిష్ట స్థాయిని చూసింది. మార్చి నుంచి ఎన్నడూ లేనంత స్థాయిలో కొత్త బిజినెస్‌ ఆర్డర్లు తగ్గాయి. ఆగస్టులో 57.2 వద్ద ఉన్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్, సెప్టెంబర్‌లో 54.3కు పడిపోయింది.

ద్రవ్యోల్బణం ఒత్తిడులు, పోటీ పూర్వక పరిస్థితులు దీనికి కారణం. అయితే సూచీ 50లోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఆపైన సూచీ ఉంటే, దానిని వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. ఈ లెక్కన గడచిన 14 నెలలుగా సేవల రంగం పురోగతి బాటన నడిచినట్లయ్యింది. ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా దాదాపు 60 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.  

సేవలు–తయారీ కలిపినా కిందకే.. 
మరోవైపు సేవలు, తయారీ రంగాలు కలిపిన ఎస్‌అండ్‌పీ  కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ కూడా మార్చి నెల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆగస్టులో 58.2 వద్ద ఉన్న సూచీ, సెప్టెంబర్‌లో 55.1కు పడిపోయింది. ప్రైవేటు రంగం అమ్మకాలు ఆరు నెలల కనిష్టానికి తగ్గాయి. ఒక్క తయారీ రంగాన్ని చూసినా, సెప్టెంబర్‌లో స్పీడ్‌ తగ్గింది. 

తయారీ రంగం స్పీడ్‌ సెప్టెంబర్‌లో  55.1కి తగ్గినట్లు  మేనేజర్స్‌ ఇండెక్స్‌  పేర్కొంది. ఆగస్టులో సూచీ 56.2 వద్ద ఉంది. అయితే తయారీ రంగం వృద్ధి బాటన ఉండడం (50 పైన) వరుసగా ఇది 15వ నెల. దాదాపు 400 సంస్థల పర్చేజింగ్‌ మేనేజర్స్‌ నుంచి పొందిన సమాచారం ఆధారంగా ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ సూచీ రూపొందిస్తుంది. 

మరిన్ని వార్తలు