ఎకానమీకి సేవల దన్ను..

4 Jun, 2022 06:21 IST|Sakshi

మేలో పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 58.9కి అప్‌

11 సంవత్సరాల్లో పటిష్ట స్థాయి

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం సవాళ్లలోనూ సేవల రంగం ఎకానమీకి మేలో దన్నుగా నిలిచింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ మేలో 58.9గా నమోదయ్యింది. గడచిన 11 సంవత్సరాల్లో సేవల రంగంలో ఈ స్థాయి పటిష్టత నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌లో సూచీ 57.9 వద్ద ఉంది. కొత్త వ్యాపారాల్లో పురోగతి సూచీ పటిష్ట స్థాయికి దోహదపడింది. నిజానికి ఈ సూచీ 50పైన ఉంటే పురోగతిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు.

దీని ప్రకారం సేవల సూచీ వృద్ధి బాటన నిలవడం ఇది వరుసగా పదవనెల. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ సేవా రంగంలో వృద్ధిని పెంచడంలో సహాయపడింది. మే నెలలో వ్యాపార కార్యకలాపాలు 11 సంవత్సరాలలో అత్యంత వేగంతో పుంజుకున్నాయి, జూలై 2011 తరువాత కొత్త ఆర్డర్‌లలో వేగవంతమైన పెరుగుదల ఇదే తొలిసారి’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పొలియానా డి లిమా పేర్కొన్నారు. భారత్‌ ఎకానమీలో సేవల రంగం వాటా దాదాపు 60%గా ఉంది.

తయారీ–సేవలు కలిపినా అదుర్చ్‌...
ఇక సేవలు, తయారీ కలగలిపిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ ఏప్రిల్‌లో 57.6గా ఉంటే, మేలో 58.3కు ఎగసింది. నవంబర్‌ తర్వాత ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. భారత్‌ తయారీ రంగం (పారిశ్రామిక ఉత్పత్తిలో 75%) మే నెల్లో స్థిరంగా ఉంది.

మరిన్ని వార్తలు