గంటలో మొబైల్‌ ఫోన్‌ డెలివరీ

13 Aug, 2020 05:39 IST|Sakshi

ఆన్‌లైన్‌ను అందిపుచ్చుకున్న రిటైల్‌ చైన్స్‌

ఈ–కామర్స్‌ కంటే వేగంగా డెలివరీ

కలిసి వచ్చిన ఔట్‌లెట్ల విస్తరణ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  కోవిడ్‌–19 కారణంగా దేశవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఏప్రిల్‌–జూన్‌ కాలంలో మొబైల్స్‌ అమ్మకాలు 50 శాతం తగ్గాయని ఐడీసీ గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌తో అమ్మకాలు లేక అద్దెలు, వేతనాల భారం కారణంగా ఆఫ్‌లైన్‌ రిటైల్‌ చైన్లు నష్టపోయాయి. అయితే ఈ నష్టాన్ని పూరించుకోవడానికి మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్స్‌ ఆన్‌లైన్‌ సేల్స్‌ను ఆసరాగా చేసుకున్నాయి. చిన్న పట్టణాల్లోనూ స్టోర్లు, సొంత నెట్‌వర్క్‌  ఉండడం వీటికి కలిసి వస్తోంది.

ఈ–కామర్స్‌కు ధీటుగా ఇవి పోటీకి సై అంటున్నాయి. ఔట్‌లెట్లు ఉన్న ప్రాంతాల్లో ఒక గంటలోనే మొబైల్‌ను డెలివరీ చేసి కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. అంతేకాదు ఈ–కామర్స్‌ కంపెనీలు ఎంతకైతే విక్రయిస్తున్నాయో అదే ధరను ఇవి కూడా ఆఫర్‌ చేస్తున్నాయి. మార్చి ముందుతో పోలిస్తే రిటైల్‌ చైన్ల ఆన్‌లైన్‌ అమ్మకాలు ఇప్పుడు గణనీయంగా అధికం కావడం విశేషం. కోవిడ్‌కు ముందు కొన్ని నగరాల్లో ఈ–కామర్స్‌ కంపెనీలు 24 గంటల్లో మొబైల్స్‌ను డెలివరీ చేశాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

చిన్న పట్టణాల్లోనూ...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బిగ్‌ సి, లాట్, బి న్యూ, హ్యాపీ, సెలెక్ట్‌ మొబైల్స్‌ వంటి సంస్థలు చిన్న పట్టణాలకూ తమ స్టోర్లతో విస్తరించాయి. బిగ్‌ సి 225 కేంద్రాలు, లాట్‌ 125, బి న్యూ 75, హ్యాపీ 70, సెలెక్ట్‌ 70 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చిన కస్టమర్‌కు ఇవి స్టోర్‌ ఉన్న ప్రాంతాల్లో గంటలోనే మొబైల్‌ను అందిస్తున్నాయి. 50 కిలోమీటర్ల లోపు డెలివరీని 90–120 నిముషాల్లోనే పూర్తి చేస్తున్నాయి.

కరోన ముందు వరకు అంతంతే నమోదైన ఆన్‌లైన్‌ సేల్స్‌ ఇప్పుడు 10–20 శాతానికి చేరాయని ‘బిగ్‌ సి’ ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి తెలిపారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటా ఏకంగా 50 శాతం ఉందని చెప్పారు. 5 శాతంగా ఉన్న ఆన్‌లైన్‌ సేల్స్‌ ఇప్పుడు 25 శాతానికి వచ్చాయని ‘బి న్యూ’ ఫౌండర్‌ వై.డి.బాలాజీ చౌదరి వివరించారు. డిసెంబరుకల్లా ఇది 40 శాతానికి వెళ్తుందన్నారు. ఆన్‌లైన్‌ సేల్స్‌ వేగంగా పుంజుకున్నాయని సెలెక్ట్‌ మొబైల్స్‌ సీఎండీ వై.గురు తెలిపారు. ఈ వారం మరో అయిదు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. మార్చికి ముందు 2 శాతంగా ఉన్న ఆన్‌లైన్‌ వాటా ఇప్పుడు 10 శాతానికి ఎగసిందని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ పేర్కొన్నారు. సర్వీస్‌ సపోర్ట్, యాక్సెసరీస్, బీమా సేవలూ కస్టమర్లు అందుకోవచ్చన్నారు.  

ట్యాబ్లెట్‌ పీసీల జోరు..
ప్రపంచవ్యాప్తంగా ట్యాబ్లెట్‌ పీసీలకు మళ్లీ జీవం వచ్చింది. 2020 ఏప్రిల్‌–జూన్‌లో విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదైందని పరిశోధన సంస్థ కెనలిస్‌ వెల్లడించింది. మొత్తం 3.75 కోట్ల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఆపిల్‌ 38 శాతం, శామ్‌సంగ్‌ 18.7, హువావే 12.7 శాతం వాటా దక్కించుకున్నాయి. అమెజాన్, లెనోవో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

భారత్‌లో అల్కాటెల్, సెల్‌కాన్, లావా వంటి కంపెనీలు కూడా ఈ విభాగంలో పోటీపడుతున్నాయి. దేశంలో రిటైల్‌ స్టోర్లలో మార్చికి ముందు ఒక శాతంగా ఉన్న ట్యాబ్లెట్‌ పీసీల అమ్మకాలు నేడు 20 శాతానికి చేరాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులు అధికం కావడంతో వీటికి డిమాండ్‌ అనూహ్యంగా పెరిగిందని టెక్నోవిజన్‌ ఎండీ సికందర్‌ తెలిపారు. ట్యాబ్లెట్స్‌కు దిగుమతి సుంకం లేకపోవడం కస్టమర్లకు ప్రయోజనంగా ఉంది.

మరిన్ని వార్తలు