ఎలక్ట్రిక్‌ హైవేలు కమింగ్‌ సూన్‌: కేంద్రం భారీ కసరత్తు  

13 Sep, 2022 11:16 IST|Sakshi

టోల్‌ ప్లాజాల్లో సౌర విద్యుత్‌  వినియోగానికి ప్రోత్సాహం 

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి  

న్యూఢిల్లీ: సౌరశక్తిని వినియోగించుకుని భారీ ట్రక్కులు, బస్సుల చార్జింగ్‌కు ఉపయోగపడేలా ఎలక్ట్రిక్‌ హైవేలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దేశీయంగా విద్యుత్‌తోనే నడిచే విధంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండో-అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐఏసీసీ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. ఉపరితలంపై ఉన్న విద్యుత్‌ లైన్స్‌తో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలకు కూడా చార్జింగ్‌ కోసం విద్యుత్‌ సరఫరా చేసే విధంగా తీర్చిదిద్దే రోడ్లను ఎలక్ట్రిక్‌ హైవేగా పరిగణిస్తారు.

మరోవైపు, టోల్‌ ప్లాజాల్లో కూడా సౌర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. మౌలిక సదుపాయాలను పటిష్టంగా అభివృద్ధి చేస్తే ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని, కొత్త వ్యాపారాలు.. ఉద్యోగాల కల్పనకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. భారత లాజిస్టిక్స్, రోప్‌వేలు, కేబుల్‌ కార్‌ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికా ప్రైవేట్‌ ఇన్వెస్టర్లను ఈ సందర్భంగా మంత్రి ఆహ్వానించారు. అలాగే, చౌకైన, విశ్వసనీయమైన ఎలక్ట్రోలైజర్లు, హైడ్రోజన్‌ ఫ్యుయల్‌ సెల్‌ టెక్నాలజీ అభివృద్ధిలో అమెరికా కంపెనీ సహకారం అందించాలని ఆయన కోరారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఫిక్సిడ్‌ డిపాజిట్‌ రేట్లకు మించి రాబడులు లభించేలా ఇన్‌విట్‌ వంటి వినూత్న పథకాలు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

వాడకాన్ని బట్టే టోల్‌ ఫీజు.. 
టోల్‌ ప్లాజా రద్దీని తగ్గించేలా నంబర్‌ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. అలాగే, టోల్‌ రహదారులపై ప్రయాణించినంత దూరానికి మాత్రమే వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేసే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు వివరించారు. టోల్‌ బూత్‌ల దగ్గర వాహనాలను ఆపాల్సిన అవసరం లేకుండా, అలాగే రహదారిని ఉపయోగించినంత దూరానికే చెల్లింపులు జరిగేలా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రీడర్‌ కెమెరాల టెక్నాలజీ ఉపయోగపడగలదని మంత్రి పేర్కొన్నారు.

2018-19లో టోల్‌ ప్లాజాల దగ్గర వాహనాల నిరీక్షణ సయమం సగటున 8 నిమిషాలుగా ఉండగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టాక 2021-22లో  ఇది  47 సెకన్లకు తగ్గిందని గడ్కరీ చెప్పారు. నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గినప్పటికీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్దిష్ట సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల పైనా, ప్రస్తుతం ఉన్న 4 పైగా లేన్ల హైవేలపైనా అధునాతన ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థ (ఏటీఎంఎస్‌) ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 2024నాటికి జాతీయ రహదారులపై 15వేల కి.మీ. మేర ఇంటెలిజెన్స్‌ ట్రాఫిక్‌ సిస్టంను(ఐటీఎస్‌) అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు   కేంద్ర మంత్రి  గడ్కరీ చెప్పారు.      

మరిన్ని వార్తలు