భారత్‌లో తగ్గిన ఇళ్ల ధరలు

11 Jun, 2021 14:40 IST|Sakshi

గతేడాదితో పోలిస్తే 1.6 శాతం తగ్గుదల 

ప్రపంచ ర్యాంకింగ్‌లో ఇండియాది 55వ స్థానం 

నైట్‌ఫ్రాంక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడి

దేశంలో గృహాల ధరలు పడిపోయాయి. గతేడాది జనవరి-మార్చితో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో ధరలు 1.6 శాతం మేర క్షీణించాయి. వార్షిక ధరల వృద్ధి ప్రాతిపదికన ప్రపంచ ర్యాంకింగ్‌లో ఇండియా 55వ స్థానంలో ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ ‘గ్లోబల్‌ హౌస్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ క్యూ1, 2021’ తెలిపింది. మొత్తం 56 దేశాలలోని గృహాల ధరల వృద్ధిని పరిశోధన చేయగా.. చిట్ట చివరి స్థానంలో 1.8 శాతం ధరల క్షీణతతో స్పెయిన్‌ నిలవగా.. దానికంటే ముందు ఇండియా నిలిచింది. గతేడాది జనవరి-మార్చిలో గ్లోబల్‌ ధరల సూచికలో ఇండియాది 43వ స్థానం. ఏడాదిలో 12 స్థానాలకు పడిపోయింది. 

కరోనా సెకండ్‌ వేవ్, కొత్త వేరియంట్ల ముప్పు, వ్యాక్సినేషన్‌లలో హెచ్చుతగ్గులతో విక్రయాలు, ధరల పెరుగుదలపై ఒత్తిడి ఉందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశీర్‌ బైజాల్‌ తెలిపారు. ఈ ఏడాది క్యూ1లో దేశంలో గృహాల విక్రయాలలో రికవరీ కనిపిస్తుందని.. దీంతో ధరలు స్థిరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. 56 దేశాలలో ఈ ఏడాది క్యూ1లో నివాస ధరలు 7.3 శాతం మేర వృద్ధి చెందాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 32 శాతం ధరల వృద్ధితో టర్కీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 22.1 శాతం వృద్ధితో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో, 16.6 శాతం వృద్ధితో లక్సెంబర్గ్‌ మూడో స్థానంలో నిలిచాయి. 2005 నుంచి యూఎస్‌ అత్యధిక వార్షిక ధరల వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఏటా ఇక్కడ గృహాల ధరలలో 13.2 శాతం వృద్ధి నమోదవుతుంది.

చదవండి: కోవిడ్‌ ఔషధాల ధరలు తగ్గేనా?

మరిన్ని వార్తలు