దేశంలో తొలిసారిగా గ్రామంలో 5జీ టెస్టింగ్..!

24 Dec, 2021 19:20 IST|Sakshi

5జీ నెట్‌వర్క్ విషయంలో దేశంలో మరో ముందడుగు పడింది. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ కోసం మొదటి సారిగా 5జీ ట్రయల్స్ గురువారం ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్రంలోని అజోల్ గ్రామం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధీనగర్‌లోని ఉనావా పట్టణంలో బేస్ ట్రాన్స్ సీవర్ స్టేషన్(బిటిఎస్)ను ఏర్పాటు చేసి ఈ పరీక్ష నిర్వహించింది. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ వేగాన్ని కొలవడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన అధికారులు, ఇద్దరు ప్రైవేట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో కూడిన బృందం గ్రామానికి చేరుకుంది. 

ఈ బృందంలో డిడిజిలు రోషామ్ లాల్ మీనా, అజత్శత్రు సోమని, డైరెక్టర్లు వికాస్ దాదిక్, సుమిత్ మిశ్రా ఉన్నారు. వారి వెంట నోకియా, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఎల్)కు చెందిన సాంకేతిక బృందాలు కూడా ఉన్నాయి. 5జీ ట్రయల్స్ సమయంలో అధికారులు డౌన్‌లోడ్ వేగం గరిష్టంగా 105.47 ఎంబిపీఎస్, అప్‌లోడ్ వేగం గరిష్టంగా 58.77 ఎంబిపీఎస్ నమోదైనట్లు తెలిపారు. ట్రయల్స్ వివరాలను మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. రియల్ టైమ్ వీడియో స్ట్రీమ్‌లతో కూడిన విఆర్ కనెక్టెడ్ క్లాస్ రూమ్, 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ(విఆర్) కంటెంట్ ప్లేబ్యాక్, 5జీ ఇమ్మర్సివ్ గేమింగ్ టెక్నాలజీ, 5జి ఇమ్మర్సివ్ గేమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) ఆధారిత 360 డిగ్రీల కెమెరాలను ట్రయల్ సైట్లో పరీక్షించినట్లు తెలిపారు.

(చదవండి: దివాలా చట్టంలో కీలక సవరణలకు కేంద్రం కసరత్తు..!)

మరిన్ని వార్తలు