120 ఎంటీకి స్టీల్‌ ఉత్పత్తి!

6 Sep, 2021 06:29 IST|Sakshi

100 ఎంటీని దాటనున్న డిమాండ్‌

ఉక్కు శాఖ సహాయమంత్రి అంచనాలు

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లో దేశీ స్టీల్‌ ఉత్పత్తి 120 మిలియన్‌ టన్నులకు చేరే వీలున్నట్లు ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తీ తాజాగా అంచనా వేశారు. ఇది 18 శాతం వృద్ధికాగా.. డిమాండ్‌ సైతం 100 ఎంటీని తాకవచ్చని పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది(2020–21)లో 6 శాతం తక్కువగా 102 ఎంటీ స్టీల్‌ తయారయ్యింది. కోవిడ్‌–19 కట్టడికి లాక్‌డౌన్‌ల అమలు ప్రభావం చూపింది. కాగా.. 2021 ఏప్రిల్‌–జూన్‌లో దేశీయంగా స్టీల్‌ ఉత్పత్తి 45 శాతం జంప్‌చేసింది.

37.52 ఎంటీని తాకింది. దీంతో ఈ ఏడాది 115–120 ఎంటీని స్టీల్‌ను తయారు చేయగలమన్న ధీమాతో ఉన్నట్లు సింగ్‌ తెలియజేశారు. జాతీయ స్టీల్‌ పాలసీ 2017లో భాగంగా ప్రభుత్వం 2030–31కల్లా 300 ఎంటీ స్టీల్‌ ఉత్పత్తిని అందుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కరోనా నేపథ్యంలో గతేడాది దేశీ స్టీల్‌ వినియోగం దాదాపు 7 శాతం క్షీణించి 93.43 ఎంటీకి పరిమితమైనట్లు వెల్లడించారు. ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్‌ను ప్రకటించిందని, ఈ పథకం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు భారీ స్థాయిలో స్టీల్‌ వినియోగం ఉంటుందని వివరించారు.

మరిన్ని వార్తలు