ఎంఆర్ఎస్ఏఎం క్షిపణి ప్రయోగం విజయవంతం

25 Dec, 2020 16:33 IST|Sakshi

భువనేశ్వర్: ఒడిశా తీరంలో గల చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఆర్మీ వెర్షన్ నుండి ప్రయోగించిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్(MRSAM) పరీక్ష విజయవంతమైంది. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే లక్ష్యంతో ఇజ్రాయెల్‌తో కలిసి సంయుక్తంగా డీఆర్‌డీవో స్వదేశీ పరిజ్ఞానంతో భారత సైన్యం కోసం ఈ క్షిపణిని రూపొందించింది. పరిక్షదశలో ఈ క్షిపణి వేగవంతమైన మానవరహిత వైమానిక లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా మొదట బ్రిటిష్ డ్రోన్ మానవరహిత వైమానిక వాహనం(యుఎవి) బాన్షీని గగన్ తలంలోకి పంపించి.. ఆ తర్వాత మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్‌తో దాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రయోగించిన మొదటి దశలోనే లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారులు తెలిపారు. 

ప్రయోగానికి ముందు డీఆర్డోవో ప్లాంట్‌కు 2.5కి.మీ పరిధిలో గల ప్రజలను ఖాళీ చేయడంతో పాటు స్థానిక మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని రెవిన్యూ అధికారులు సూచించారు. దాదాపు 100కి.మీ దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. అలాగే 60కేజీ పేలోడ్, 4.5 మీటర్ల పొడవైన అణు సామర్థ్యం గల క్షిపణిలను ఇది మోసుకెళ్లగలదు. దీని బరువు సుమారు 2.7 టన్నులు. మెరుపువేగంతో భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ మిషన్‌లో పాల్గొన్న డీఆర్‌డీఓ, అనుబంధ బృంద సభ్యుల కృషిని ప్రశంసించారు. స్వదేశీ ఆధునిక ఆయుధ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో భారతదేశం ఉన్నత స్థాయి సామర్థ్యాన్ని సాధించిందని అన్నారు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్‌డీఓ బృందాన్ని డీఫెన్స్ ఆర్ అండ్ డీ కార్యదర్శి, ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి అభినందించారు.

మరిన్ని వార్తలు