ఎన్ని కోట్లయినా సరే.. తగ్గేదేలే!సూపర్‌ రిచ్‌ ఇక్కడ!

16 Jun, 2022 11:27 IST|Sakshi

సాక్షి, ముంబై: సూపర్-లగ్జరీ కార్ల విక్రయాలు సూపర్‌ వేగంతో దూసుకుపోతున్నాయి. దేశంలో అంతకంతకు పెరుగుతున్న బిలియనీర్ల  కారణంగా  కరోనా సంక్షోభంలో కూడా  రూ. 2 కోట్లకు పైగా విలువున్న కార్లను హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. ముఖ్యంగా  కరోనా మహమ్మారి తరువాత దేశీయ కుబేరులు లగ్జరీ కార్లను ఎగరేసుకుపోతున్నారట. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్‌ సేల్స్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనాకి ముందున్న గరిష్ట స్థాయిలను అధిగమించే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 

2018లో భారతదేశంలోని అత్యంత సంపన్నులు రూ. 2 కోట్లకు పైగా ధర కలిగిన 325 లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. అయితే కోవిడ్-19 మహమ్మారి దెబ్బకు 2020లో వాటి సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. కానీ ప్రస్తుతం భారతదేశంలోని లగ్జరీ కార్ మార్కెట్‌లో పదివేల యూనిట్లకు పైగా ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయని ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఒక రిపోర్టులో తెలిపింది. 

ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఇటాలియన్ సూపర్-లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని, ఆర్థిక అనిశ్చితి పరిస్థితిల్లో  కూడా కార్‌ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. 2022 మొదటి ఐదు నెలల్లో ఊహించిన దానికంటే ట్రెండ్ బాగా పుంజుకుందని లంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్‌ని పేర్కొన్నారు. ఈ నెంబర్లు సూపర్-లగ్జరీ కార్ల మార్కెట్ సామర్థ్యం కంటే ప్రపంచంలో ఇండియాలో అత్యధికంగా పెరుగుతున్న  బిలియనీర్‌ల సంఖ్యను ప్రతిబింబిస్తోందన్నారు. ఇంతకుముందు మూడో/ నాల్గవ తరం వ్యాపారులకు మాత్రమే లగ్జరీ కార్లను విక్రయించాం కానీ ఇపుడు మొదటి తరం వ్యాపారవేత్తలు, మహిళలు, ఇతరులతో తమ కస్టమర్ బేస్  మరింత విస్తరించిందని అగర్వాల్ వెల్లడించారు.

కోటి  రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న మెర్సిడెస్ బెంజ్ హై-ఎండ్ లగ్జరీ కార్ల వాటా 2018లో 12 శాతంతో పోలిస్తే 2022లో 29 శాతానికి రెండింతలు పెరిగింది. దాదాపు 5వేల మందిలో మూడింట ఒక వంతు మంది తమ లగ్జరీ కారు వినియోగిస్తున్నారని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ ష్వెంక్‌ చెప్పారు.  2021లో  2వేల లగ్జరీ కార్లను విక్రయించిన   బెంజ్  చేతిలో కోటి రూపాయల కంటే ఎక్కువ  ధర వాహనాల  ఆర్డర్లు  పెండింగ్‌లో ఉన్నాయిట.

కాగా ఇటీవల లంబోర్ఘిని అవెంటడోర్‌ అవెంటోని లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీని అంచనా ధర సుమారు 8-10 కోట్లు. లిమిటెడ్‌ ఎడిషన్‌గా ప్రపంచవ్యాప్తంగా 600 కార్లను  రిలీజ్‌ చేయగా ఇప్పటికే అన్ని కార్లు బుక్‌ అయిపోయాయి. ఇందులో ఇండియా నుంచి ఒకరు ఉండటం విశేషం. 

 ఇది కూడా చదవండి: Lamborghini Aventador Ultimae: వావ్‌..లిమిటెడ్‌ ఎడిషన్‌ స్పోర్ట్స్‌కార్: హాట్‌ సేల్‌

మరిన్ని వార్తలు