-

Cryptocurrency: భారత్‌లో క్రిప్టో కరెన్సీ! నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు!

28 Apr, 2022 07:59 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్‌లో ఇన్వెస్ట్‌ చేసే విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అమెరికన్‌ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి సలహాలు, సూచనలేమైనా ఉంటే స్వీకరించేందుకు, తగు పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. భారత డిజిటల్‌ విప్లవంలో పెట్టుబడులు అంశంపై రౌండ్‌టేబుల్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. 

భారత్‌లో పెట్టుబడులు మరింతగా పెంచాలని ఇన్వెస్టర్లను కోరారు. దేశీ స్టార్టప్‌లతో చేతులు కలిపేందుకు ఆసక్తిగా ఉన్న వారి కోసం స్టార్టప్‌ సెల్‌ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు ట్వీట్‌ చేసింది. భారీ సంఖ్యలో యూనికార్న్‌లను (1 బిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే అంకుర సంస్థలు) తీర్చిదిద్దే సామర్థ్యాలు భారత్‌కు పుష్కలంగా ఉన్నాయని సిలికాన్‌ వ్యాలీ ఇన్వెస్టర్లు అభిప్రాయపడినట్లు పేర్కొంది. 

మహిళా సీఎక్స్‌వోలతో భేటీ.. 
ఇన్వెస్టర్లతో భేటీకి ముందు..ఫిన్‌టెక్, ఆరోగ్యం, విద్య, ఐటీ తదితర రంగాల సంస్థల మహిళా చీఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్లతో (సీఎక్స్‌వో) నిర్మలా సీతారామన్‌ సమావేశమయ్యారు. భారత్‌ వృద్ధిలో వారు పోషించగలిగే పాత్ర గురించి చర్చించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి వివరించారు. అటు స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థుల బృందాన్ని కూడా నిర్మలా సీతారామన్‌ కలిశారు. అటు అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి జేమ్స్‌ మాటిస్‌తో సమావేశమై ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చగల అంశాలపై చర్చించారు. బయోటెక్‌ స్టార్టప్‌ సంస్థ పర్ఫెక్ట్‌ డే సహ వ్యవస్థాపకుడు పెరుమాళ్‌ గాంధీతోనూ మంత్రి భేటీ అయ్యారు. మేకిన్‌ ఇండియాలో భాగం అయ్యేందుకు తమ ప్రణాళికలను ఆమెకు గాంధీ వివరించారు.  

క్రిప్టోలపై తగు నిర్ణయం తీసుకుంటాం.. 
క్రిప్టో కరెన్సీలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వర్చువల్‌ కరెన్సీల నియంత్రణ అంశాన్ని లోతుగా పరిశీలించి, భారత్‌ తగు నిర్ణయం తీసుకుంటుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ విషయంలో తొందరపడబోమని పేర్కొన్నారు. అలాగని, కొత్త ఆవిష్కరణలను దెబ్బతీయాలన్నది  తమ ఉద్దేశ్యం కాదని .. నవకల్పనలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆమె వివరించారు.    

చదవండి👉అంతా మోదీ చలవే!, దేశంలో పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం!

మరిన్ని వార్తలు