కోవిడ్‌–19పై శక్తివంచనలేకుండా పోరు

17 Oct, 2020 05:04 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రపంచబ్యాంక్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ప్లీనరీ 102వ సమావేశంలో పాల్గొన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఇతర సీనియర్‌ అధికారులు

ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌

ప్రపంచబ్యాంక్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ప్లీనరీ సమావేశంలో ప్రసంగం  

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని కోవిడ్‌–19 ప్రభావం నుంచి తప్పించడానికి తగిన చర్యలను నిరంతరం తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ప్లీనరీ 102వ సమావేశాన్ని ఉద్దేశించి శుక్రవారం ఆమె మాట్లాడారు. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతానికి సమానమైన ఉద్దీపన ప్యాకేజ్‌సహా, కార్మిక రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తున్నట్ల వివరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... కరోనా వైరస్‌ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.

పేదరికం నిర్మూలనకు పలు సంవత్సరాలుగా జరుగుతున్న కృషి తాజా పరిస్థితుల్లో నీరుగారిపోయే వాతావరణం నెలకొంది. మహమ్మారి ప్రభావం సామాజిక, ఆర్థిక రంగాలపై పడకుండా తగిన చర్యలు అన్నింటినీ భారత్‌ ప్రభుత్వం తీసుకుంటోంది. నాబార్డ్‌ ద్వారా రీఫైనాన్షింగ్‌ మద్దతు మార్గంలో గ్రామీణ రంగానికి అండగా నిలవడం జరుగుతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులను పెంచడం జరిగింది. ప్రత్యేకించి ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి తగిన కృషి జరుగుతోంది. మహమ్మారి నిర్మూలనకు ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. ఈ దిశలో తనవంతు సహకారం, అనుభవ పాఠాలను అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉంటుంది.   

80 సంవత్సరాల్లో ఎన్నడూలేని విపత్కర పరిస్థితి:  ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్‌
కాగా కరోనా మహమ్మారి ప్రతికూలతల నేపథ్యంలో ప్రపంచం గత 80 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అభిప్రాయపడ్డాయి. రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వార్షిక సమావేశం శుక్రవారం ముగిసింది. అనంతరం విడుదలైన ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. ‘‘కోవిడ్‌–19 వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగింది. అసమానతలు తీవ్రమయ్యాయి. దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ సమస్య తీవ్రత ఇంకా కొనసాగుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రపంచదేశాలన్నీ ఒకతాటిపైకి రావాలి.

పరస్పర సహకారంతోనే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది’’ అని ప్రకటన పేర్కొంది. ఇదిలావుండగా, జూన్‌ 2021 నాటికి కరోనా వైరస్‌ పోరులో భాగంగా 160 బిలియన్‌ డాలర్ల సహాయాన్ని అందించడానికి ప్రపంచబ్యాంక్‌ తగిన కృషి జరపాలని బ్యాంక్‌ స్టీరింగ్‌ కమిటీ శుక్రవారం విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు అదనపు అత్యవసర నిధి, రుణ సౌలభ్యతలను కలిగించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే 100 బిలియన్‌ డాలర్ల సహాయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్‌ కూడా కరోనా పోరు విషయంలో తన చర్యలను మరింత ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేసింది.   
 

మరిన్ని వార్తలు