ఆ విస్కీ దిగుమతుల్లో ఫ్రాన్స్‌ను దాటేసిన భారత్‌.. మరీ అంతలా తాగుతున్నారా..?

13 Feb, 2023 11:27 IST|Sakshi

ఖరీదైన ఫారిన్‌ మద్యం స్కాచ్‌ విస్కీ దిగుమతుల్లో భారత్‌.. ఫ్రాన్స్‌ను దాటేసింది. 2021తో పోల్చుకుంటే 2022లో ఈ విస్కీ దిగుమతులు ఏకంగా 60 శాతం పెరిగాయి. స్కాట్‌ల్యాండ్‌కు చెందిన స్కాచ్‌ విస్కీ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం.. భారత్‌ 2021లో 205 మిలియన్ల 70సీఎల్‌ (700 ఎంఎల్‌) బాటిళ్ల విస్కీని దిగుమతి చేసుకుంటే 2022లో  219 మిలియన్ల బాటిళ్లను దిగుమతి చేసుకుంది. ఈ లెక్కన భారత్‌ స్కాచ్‌ మార్కెట్‌ పదేళ్లలో 200 శాతం వృద్ధి చెందింది. 

మరోవైపు రెండంకెల వృద్ధి ఉన్నప్పటికీ ఇండియన్‌ విస్కీ మార్కెట్‌లో స్కాచ్‌ విస్కీ వాటా కేవలం రెండు శాతమే. యూకే-భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్‌లో తమ మార్కెట్‌ను మరింత విస్తరించునేందుకు స్కాట్‌ల్యాండ్‌ విస్కీ కంపెనీలకు వీలు కలిగిందని స్కాచ్‌ విస్కీ అసోసియేషన్‌ పేర్కొంది. రానున్న ఐదేళ్లలో 1 బిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్ల మేర వృద్ధి ఉంటుందని అభిప్రాయపడింది.

2021లో భారత్‌కు స్కాచ్‌ ఎగుమతుల విలువ 282 మిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్లు. తైవాన్‌, సింగపూర్‌, ఫ్రాన్స్‌ల తర్వాత ఇది అయిదో స్థానం. 2022లోనూ యూరోపియన్‌ యూనియన్‌ను ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ అధిగమించి అతిపెద్ద ప్రాంతీయ మార్కెట్‌గా అవతరించింది. కోవిడ్‌ అనంతరం భారత్‌ సహా తైవాన్‌, సింగపూర్‌, చైనాలకు  స్కాచ్‌ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదైంది.

(ఇదీ చదవండి: లైసెన్స్‌ లేకుండా అమ్ముతారా..? అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు నోటీసులు!)

మరిన్ని వార్తలు