అవసరంలేని దిగుమతులను గమనిస్తున్నాం

17 Dec, 2022 10:41 IST|Sakshi

న్యూఢిల్లీ: అవసరం లేని దిగుమతులను గమనిస్తున్నామని, ఆయా ఉత్పత్తుల దేశీ తయారీ పెంచడం తమ ప్రాధాన్యతని కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి సత్య శ్రీనివాస్‌ తెలిపారు. ఈ తరహా దిగుమతులను నివారించగలిగితే, వాణిజ్య లోటు దిగొస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు వాణిజ్య లోటు 198 బిలియన్‌ డాలర్లకు పెరిగిపోవడం తెలిసిందే.

అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వాణిజ్య లోటు 115 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. ఎన్నో సవాళ్లు నెలకొన్నా భారత్‌ నుంచి ఎగుమతులు బలంగా ఉన్నట్టు మీడియాతో చెప్పారు. గతేడాది అసాధారణ స్థాయిలో ఎగుమతులు పెరగడంతో, ఆ బేస్‌ ప్రభావం వల్ల ఈ ఏడాది పెద్దగా వృద్ధి కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అన్ని శాఖలకు నెలవారీగా దిగుమతులు పెరుగుతున్న సమాచారాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. స్థానికంగా తయారీని పెంచాలన్నదే ఇందులో వ్యూహంగా పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం మన దేశ ఎగుమతులపై ప్రభావం పడింది. కానీ, దేశీ వినియోగ డిమాండ్‌ బలంగా ఉండడంతో దిగుమతులు పెరుగుతున్నాయి. దీంతో వాణిజ్య లోటు విషయంలో ఒత్తిడి నెలకొంది’’అని వివరించారు.   

చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్‌ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్‌!

మరిన్ని వార్తలు