రుతుపవనాలు ఎఫెక్ట్‌.. దిగొచ్చిన నిరుద్యోగం

3 Aug, 2022 08:41 IST|Sakshi

ముంబై: దేశంలో నిరుద్యోగం గడిచిన ఆరు నెలల్లో కనిష్టానికి చేరింది. జూన్‌ నెలలో నమోదైన 7.80 శాతం నుంచి, జూలైలో 6.80 శాతానికి దిగొచ్చింది. వర్షకాలంలో సాగు సంబంధిత కార్యకలాపాలు పెరగడం ఉపాధి కల్పన పెరిగేందుకు దారితీసింది. ఈ వివరాలను సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసింది. గ్రామీణ నిరుద్యోగం రేటు 6.14 శాతానికి తగ్గిందని, ఇది అంతకుముందు నెలలో 8.03 శాతంగా ఉందని సీఎంఐఈ తెలిపింది.

పట్టణాల్లో నిరుద్యోగం పెరిగింది. జూన్‌లో ఉన్న 7.80 శాతం నుంచి జూలైలో 8.21 శాతానికి చేరింది. పరిశ్రమలు, సేవల రంగాల్లో ఉద్యోగాలు తగ్గాయి. నెలవారీగా ఉపాధి కల్పనలో రికవరీ కొద్దిగానే ఉందని.. జూన్‌లో 1.3 కోట్ల మందికి ఉపాధి నష్టం ఏర్పడితే, జూలైలో కేవలం 63 లక్షల మందికే కొత్తగా ఉపాధి లభించినట్టు సీఎంఐఈ ఎండీ, సీఈవో మహేష్‌వ్యాస్‌ తెలిపారు.  

సాగు రంగం వల్లే.. 
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగ కార్యకలాపాలు పెరగడం  జూలైలో నిరుద్యోగం తగ్గడానికి ప్రధాన కారణమని సీఎంఐఈ నివేదిక పేర్కొంది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో ఖరీఫ్‌ సాగు పనులు ఊపందుకున్నట్టు తెలిపింది. అయితే, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఇప్పటికీ సాగు బలహీనంగా ఉందని వ్యాస్‌ పేర్కొన్నారు. జూలై చివరి వరకు ఉన్న డేటాను చూస్తే వరి సాగు 13 శాతం మేర బీహార్‌ యూపీ, పశ్చిమబెంగాల్‌లో తగ్గినట్టు చెప్పారు. ‘‘ఖరీఫ్‌ సాగు మెరుగుపడనంత వరకు గ్రామీణ ఉపాధి కల్పనలో పురోగతి కనిపించదు. రానున్న రోజుల్లో రుతుపవనాలు మరింత బలపడతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనపై సానుకూల ప్రభావం చూపిస్తుంది’’అని వ్యాస్‌ చెప్పారు.
చదవండి: Raghuram Rajan: అందుకే భారత్‌కు శ్రీలంక పరిస్థితి రాలేదు

మరిన్ని వార్తలు