ప్రపంచ రికవరీకి చమురు మంట

21 Oct, 2021 04:54 IST|Sakshi

తీవ్ర ధరలపై భారత్‌ హెచ్చరిక

దీర్ఘకాలిక కాంట్రాక్టులతో స్థిర ధరల వ్యవస్థ ఏర్పాటుకు పిలుపు  

న్యూఢిల్లీ: ముడి చమురు ధరల తీవ్రతపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రపంచ ఎకానమీ రికవరీపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. భారత్‌ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగ దేశమేకాకుండా, దిగుమతుల విషయంలోనూ ఇదే స్థానాన్ని ఆక్రమిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్‌ బేరల్‌ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయిలో 80 డాలర్లపైన స్థిరంగా కదలాడుతుండడం, దేశీయంగా పెట్రో ధరలు మండిపోతుండడం, దీనితో ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాల నేపథ్యంలో సీఈఆర్‌ఏవీక్‌ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరమ్‌లో భారత్‌ చమురు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► కోవిడ్‌–19 వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. క్రూడ్‌ ధరల తీవ్రతతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రికవరీకి తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది.  
► క్రూడ్‌ ధరల ఒడిదుడుకుల పరిస్థితిని అధిగమించాల్సి ఉంది. ఇందుకు దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులు అవసరం. స్థిర ధరల వ్యవస్థకు ఇది దోహదపడుతుంది.  
► చమురు డిమాండ్, ఒపెక్‌ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం) వంటి ఉత్పత్తిదారుల సరఫరాలకు మధ్య పొంతన లేదు. ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన అవసరం ఉంది.  
► క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల వర్థమాన దేశాలకే కాకుండా, పారిశ్రామిక దిగ్గజ దేశాలకూ కష్టాలు తప్పవు. ప్రపంచ ఆరి్థక వ్యవస్థ స్థిరంగా వృద్ధి బాటన పయనించేలా చూడ్డం అందరి బాధ్యత. ఇతర దేశాల మంత్రులతో సమావేశాల సందర్భంగా నేను ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను.  
► 2020 జూన్‌లో 8.8 బిలియన్‌ డాలర్లు ఉన్న భారత్‌ చమురు దిగమతుల బిల్లు, 2021లో సగటున 24 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

కాంట్రాక్ట్‌ విధానం మారాలి: తరుణ్‌ కపూర్‌
ఇదే సమావేశంలో పెట్రోలియం వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ మాట్లాడుతూ, సౌదీ అరేబియా, ఇరాక్‌ వంటి ఒపెక్‌ దేశాల నుండి చమురు కొనుగోలు చేయడానికి భారతదేశం వంటి దిగుమతి చేసుకునే దేశాలు ప్రస్తుతం ‘వన్‌–టర్మ్‌ కాంట్రాక్ట్‌’ను కుదుర్చుకున్నాయని చెప్పారు. ఈ తరహా ఒప్పందాలు సరఫరాలకు సంబంధించి పరిమాణం స్థిరత్వాన్ని మాత్రమే అందిస్తాయని తెలిపారు. డెలివరీ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి ధరల విధానం ఉంటోందన్నారు.

ఈ సమస్య తొలగాలంటే ఒక బెంచ్‌మార్క్‌గా ధరలకు అనుసంధానమయ్యే దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌ అవసరమని సూచించారు.  భారత్‌ తన మొత్తం క్రూడ్‌ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. గ్యాస్‌ విషయంలో ఇది 55 శాతంగా ఉంది. భారత్‌లో చమురు డిమాండ్‌ కూడా అధికంగా ఉంది. భారత్‌ ఎకానమీ రికవరీకి దెబ్బతగిలితే, అది చమురు ఉత్పత్తిదారులకూ నష్ట మేనని భారత్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు