India Welcomes Elon Musk: వెల్‌కమ్‌ టూ ఎలాన్‌ మస్క్‌.. షరతులు వర్తిస్తాయి..

18 Jun, 2022 19:33 IST|Sakshi

ఎలన్‌మస్క్‌కి భారత్‌ స్వాగతం చెబుతోందన్నారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నరేంద్రనాథ​ పాండే.  మస్క్‌కి చెందిన టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లను ఇండియాలో నిరంభ్యంతరంగా అమ్ముకోవచ్చంటూ కూడా సెలవిచ్చారు. అయితే ఈ పనులు జరగాలంటే భారత ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాలను అనుగుణంగానే చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సదస్సులో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో టెస్లా ఇక భారత్‌లో అడుగుపెట్టడం కష్టమనే అభిప్రాయం నెలకొంది.

కాలుష్య రహితమైన కార్లు అయినందున టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లకు పన్ను రాయితీ ఇవ్వాలంటూ 2021 ఆగస్టులో ఎలన్‌ మస్క్‌ భారత ప్రభుత్వాన్ని కోరారు. దీనికి భారత్‌ స్పందిస్తూ.. పన్ను రాయితీ కావాలంటే ఇండియాలో కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. లేదంటే పన్నులు ఇతర లగ్జరీ విదేశీ కార్లకు ఏ విధంగా వర్తిస్తున్నాయో యథావిధిగా అవే అమలు అవుతాయంటూ తేల్చి చెప్పింది. పది నెలలు గడిచినా ఇరు వర్గాలు తమ వైఖరులను మార్చుకోలేదు. 

కాగా ఇటీవల టెస్లా కంపనీకి ఇండియా హెడ్‌గా నియమితుడైన మనుజ్‌ ఖురానా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇండియాలో టెస్లా అడుగు పెట్టే విషయం అనుమానంలో పడింది. ఈ సమయంలో కూడా భారత్‌ పాత వైఖరికే కట్టుబడి ఉన్నట్టు మంత్రి వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. దీంతో ఇప్పుడప్పుడే టెస్లా కార్లు ఇండియన్‌ రోడ్లపై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోయే అవకాశం కనిపించడం లేదు.

చదవండి: ఎలన్‌ మస్క్‌ నీ పద్దతి మార్చుకో..లేదంటే నీకే నష్టం!

మరిన్ని వార్తలు