భారత్‌ వృద్ధి పటిష్టం

27 Dec, 2022 04:56 IST|Sakshi

టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌  

న్యూఢిల్లీ: భారత్‌ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కలిగి ఉందని, 2023లోనూ ఇదే హోదాను కొనసాగిస్తుందని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. మహమ్మారి, ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్‌ ఎకానమీ వృద్ధి బాటన తన ప్రత్యేకతను చూటుకుంటోందని 9.35 లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. పటిష్ట వినియోగ విశ్వాసం, పెట్టుబడులు భారత్‌ వృద్ధి బాటకు మద్దతు నిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలోకి వస్తుందన్న భరోసాను వెలిబుచ్చారు.  

టాటా సన్స్‌ విజయాలు...
టాటా సన్స్‌ 2022లో అద్భుత విజయాలను సాధించినట్లు కూడా ఈ సందర్భంగా వివరించారు. గ్రూప్‌లోకి ఎయిర్‌ ఇండియాను తిరిగి తీసుకురావడం, కస్టమర్లకు చక్కటి సేవలకు సంబంధించి టాటాన్యూ ఆవిష్కరణ, క్యాలెండర్‌ ఇయర్‌లో 5,00,000 టాటా మోటార్స్‌ పాసింజర్‌ వెహికిల్స్‌ విక్రయాలు, టాటా ఈవీ కార్ల 10 శాతం మార్కెట్‌ వాటా వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టాటా సంస్థలకు ఇదే విజయవంతమైన ప్రయాణం వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘మనం మన సంస్థల పురోగతి, వ్యాపారాలు, వాటాదారుల ప్రయోజనం  కోసం మాత్రమే కాకుండా.. మన దేశం, ప్రజల సమోన్నతి సాధనకు భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో పురోగమిస్తాం. సాంకేతికత, తయారీ, స్థిరత్వ అంశాల్లో కొత్త ప్రమాణాలను మనం నెలకొల్పగలుగుతాము’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు