ఎక్కడ తక్కువ ధరో అక్కడే కొంటాం! 

27 Mar, 2021 00:21 IST|Sakshi

క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోళ్లపై భారత్‌ స్పష్టీకరణ

సౌదీ అరేబియా తీరు ‘దౌత్యరీతి’ కాదని విమర్శ  

న్యూఢిల్లీ: క్రూడ్‌ ఆయిల్‌ను ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్‌ కొనుగోలు చేస్తుందని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం స్పష్టం చేశారు. ఉత్పత్తి, సరఫరాల విషయంలో నియంత్రణలు లేకుండా చూస్తూ, తక్కువ ధరకు చమురు సరఫరా చేయాలన్న భారత్‌ విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా సమాధానం ‘దౌత్యధోరణి’ కాని రీతిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా ఎకనమిక్‌ సమావేశంలో ఆయన ప్రసంగం, ఈ అంశానికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే... 
►డిమాండ్‌ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు భావిస్తున్న నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు 14 నెలల గరిష్ట స్థాయిని తాకాయి.  

►ఈ నేపథ్యంలో చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఇందుకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాలపై  నియంత్రణలను సడలించాలని భారత్‌ విజ్ఞప్తి చేసింది.  
►ఈ విజ్ఞప్తిని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఈ నెల మొదట్లో ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. పైగా ఒపెక్‌ సమావేశం అనంతరం మార్చి 4వ తేదీన సౌదీ అరేబియా భారత్‌కు ఒక ఉచిత సలహా ఇస్తూ, కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సూచించింది.  2020 ఏప్రిల్‌–మే మధ్యన భారత్‌ 16.71 మిలియన్‌ బ్యారళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాటక)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారల్‌ క్రూడాయిల్‌ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది.

►ఒపెక్‌ చేసిన ప్రకటనపై శుక్రవారం టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా ఎకనమిక్‌ సమావేశంలో చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది కరోనా వైరస్‌పరమైన కారణాలతో డిమాండ్‌ పడిపోయి, ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్‌ కూటమి నిర్ణయించుకున్నప్పుడు తాము కూడా మద్దతునిచ్చామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్‌ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్‌ అప్పట్లో హామీ ఇచ్చిందని .. కానీ ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థితికి రావడం లేదని ప్రధాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగిపోతే రేట్లు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

►ప్రపంచంలో చమురు దిగుమతులకు సంబంధించి మూడవ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో రిఫైనర్స్‌ ఇప్పటికే తమ చమురు అవసరాలకు పశ్చిమ ఆసియావైపుకాకుండా తక్కువ ధరకు లభించే ఇతర దేశాల వైపూ దృష్టి పెడుతున్నాయి. నిజానికి సౌదీ అరేబియా భారత్‌కు రెండవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. ఫిబ్రవరిలో ఈ స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. చమురు దిగుమతుల విషయంలో తన ప్రయోజనాలకు భారత్‌ ప్రాధాన్యత ఇస్తుందని శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. దేశం ఏదైనా తక్కువ ధరకు లభ్యమైనచోటి నుంచే చమురును కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.  భారత్‌ చమురు వినియోగంపై సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్‌ అబ్దుల్లాజిజ్‌ బిన్‌ సల్మాన్‌ చేసిన ప్రకటనను ‘‘సన్నిహితమైన స్నేహితుని’’  నుంచి  ‘‘దౌత్యరీతిలేని సమాధానం’’ అని ప్రధాన్‌ అభివర్ణించారు. ఇలాంటి వైఖరిని భారత్‌ అసలు అంగీకరించబోదని అన్నారు. భారత్‌ వ్యూహాత్మక చమురు నిల్వలను ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలన్నది భారత్‌ నిర్ణయమని పేర్కొన్నారు. 

►సౌదీ అరేబియాకన్నా, అమెరికాకే భారత్‌ ప్రాధాన్యత ఇస్తుంది అన్న విషయాన్ని ఫిబ్రవరి చమురు దిగుమతి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్న అంశం ఇక్కడ ప్రధానం కాదు. భారత్‌ ప్రయోజనాల పరిరక్షణ ఎలా అన్నదే ఇక్కడ ముఖ్యం. మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్‌. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతిచేసుకునే అవకాశం మా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ప్రైవేటు రంగం చమురు ద్గిగజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది ప్రధానం కాదు.’’ అని అన్నారు. 

ప్రస్తుత ధరలు ఇలా... 
ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయంగా నైమెక్స్‌ స్వీట్‌ క్రూడ్‌ ధర బ్యారల్‌కు 61.16 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్‌ క్రూడ్‌ ధర 64.64 వద్ద ట్రేడవుతోంది.  ఒపెక్, అనుబంధ దేశాలు సరఫరాపై నియంత్రణలు కొనసాగించనున్న నేప థ్యంలో విశ్లేషకులు... ముడిచమురు ధరల అంచనాలను కూడా సవరించడం ప్రారంభించారు. 2020 రెండో త్రైమాసికంలో బ్రెంట్‌ క్రూడ్‌ రేటు మరో 5 డాలర్లు పెరిగి 75 డాలర్లకు (బ్యారల్‌కు) చేరవచ్చని, మూడో త్రైమాసికానికి 80 డాలర్లకు చేరొచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రెంట్‌ రేటు 75 డాలర్లకు (బ్యారల్‌కు), నైమెక్స్‌ క్రూడ్‌ 72 డాలర్లకు (బ్యారల్‌కు) చేరొచ్చని యూబీఎస్‌ అంచనాలను సవరించింది. 

దేశంలో పెట్రో ధరల మంట... 
గతేడాది ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో భారత్‌ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు రేటు బ్యారల్‌కు 50 డాలర్ల కన్నా తక్కువే ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్‌ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్‌ రేట్లపై ఎక్సైజ్‌ డ్యూటీని ప్రభుత్వం దఫదఫాలుగా పెంచుకుం టూ వస్తుండటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం ఢిల్లీలోని రేట్ల ప్రకారం పెట్రోల్‌ ధరలో మూడో వంతు ఎక్సైజ్‌ డ్యూటీ ఉంటుండగా, డీజిల్‌ ధరలో 40 శాతం దాకా ఉంటోంది. దీనికి రాష్ట్రాలు విధించే పన్నులు కూడా తోడవడం రేట్లకు మరింతగా ఆజ్యం పోస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్‌ ధర ఇప్పటికే రూ. 100 దాటిపోయింది. తాజాగా అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు ఇంకా పెరిగిన పక్షంలో దేశీయంగా ఇంధనాల రిటైల్‌ రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. పెట్రోల్, డిజిల్‌ ధరలను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తెస్తే, ధర కొంత తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నప్పటికీ అలాంటిది ఇప్పట్లో సాధ్యంకాదని కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. 

మరిన్ని వార్తలు