ధరలు అదుపులో భారత్‌ విజయం

1 Dec, 2022 04:32 IST|Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా

రాయిటర్స్‌ నెక్ట్స్‌ ఈవెంట్‌లో ప్రసంగం  

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని మెరుగ్గా నిర్వహించడంలో భారతదేశం విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం  వ్యక్తం చేశారు. ఆహార ధరలపై సరఫరా వైపు ఒత్తిడిని పరిష్కరించడానికి కేంద్రం ఇప్పటికే పలు చర్యలతో కూడిన చక్కటి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని అన్నారు. వెర్చువల్‌గా జరిగిన ‘రాయిటర్స్‌ నెక్ట్స్‌’ ఈవెంట్‌లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు..

► అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్లే ద్రవ్యోల్బణం తీవ్రమవుతోంది. ముఖ్యంగా క్రూడ్‌ ధరల తీవ్రతను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.  
► ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయగలమన్న విశ్వా సం ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ఇందుకు తగిన సమాచారం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభం లేదా మధ్యలో ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగివస్తుందని భావిస్తున్నాం.  
► భారత్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటుందని భావిస్తున్నాం.  
► రష్యా నుంచి భారత్‌కు దిగుమతులు పెరిగాయి. పశ్చిమ దేశాల కూడా రష్యా నుంచి ఇంధనం వంటి దిగుమతులను ప్రస్తుతం పెంచుకుంటున్నాయి.  

 
భారత్‌–రష్యా సంబంధాలపై ఇలా...
భారతదేశం నుండి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోవడానికి రష్యా ఆసక్తి గురించి అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ,  భారతదేశం ఇప్పటికే రూపాయి ట్రేడ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిందని మంత్రి చెప్పారు. ‘‘నిజానికి ఈ తరహా ఫ్రేమ్‌వర్క్‌ కొత్తది కాదు. ఇది చాలా దశాబ్దాలుగా ఉంది. అయితే  మనకు అవసరమైనప్పుడు దానిని ఉపయోగిస్తాము. ఈ ఫ్రేమ్‌వర్క్‌ కింద మనం కొనడం– అమ్మడం వంటి చర్యలను నిర్వహించవచ్చు.  మనం కొనుగోలు చేసే ఎరువులు లేదా ఇంధనాలకు సంబంధించి ఆ దేశంతో వాణిజ్య సమతుల్యతా అవసరమే. ఇందులో భాగంగా మనం ఖచ్చితంగా కొన్ని ఉత్పత్తులు ఆ దేశానికి విక్రయించాలి’’ అని సీతారామన్‌ ఈ సందర్భంగా అన్నారు.  

ద్రవ్యోల్బణం తీరిది..
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా,  ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్‌ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సీపీఐ కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై  గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ నేతృత్వంలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఇటీవలే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది.  మే తర్వాత సెంట్రల్‌ బ్యాంక్‌ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది.  తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్‌ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనుంది. మరోదఫా రెపో రేటు పెంపు ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు