India WPI Inflation: టోకు ధరలు... గుభేల్‌!

18 May, 2021 04:28 IST|Sakshi

ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 10.49 శాతం

ఆహారం, ముడి చమురు, తయారీ ఉత్పత్తుల ధరల తీవ్రత

మున్ముందూ కొనసాగవచ్చని అంచనా

లోబేస్‌ ఎఫెక్ట్‌ దీనికి ప్రధాన కారణం  

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 ఏప్రిల్‌లో భారీగా 10.49 శాతం పెరిగింది. అంటే సూచీలోని ఉత్పత్తుల ధరలు 2020 ఏప్రిల్‌తో పోల్చితే తాజా సమీక్షా నెలలో 10.49 శాతం పెరిగాయన్నమాట. సూచీలోని ప్రధాన విభాగాలైన ఆహారం, ముడి చమురు, తయారీ రంగాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం మొత్తం సూచీపై ప్రభావం చూపింది. ఇదే పెరుగుదల తీరు మున్ముందూ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణాల్లో లోబేస్‌ ఎఫెక్ట్‌ ఒకటి.

గత ఏడాది ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా 1.57 శాతం క్షీణించిన విషయం ఇక్కడ గమనార్హం.  ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడం బేస్‌ ఎఫెక్ట్‌గా పేర్కొంటారు. ఇక్కడ 2020 ఏప్రిల్‌లో   అసలు వృద్ధి నమెదుకాకపోగా భారీగా 1.57 శాతం  క్షీణత నమోదుకావడం (లో బేస్‌) ఇక్కడ గమనార్హం. వరుసగా నాలుగు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. 2021 మార్చిలో ఈ రేటు 7.39 శాతంగా ఉంది. వాణిజ్య పరిశ్రమల శాఖ  తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు...


► ఫుడ్‌ ఆర్టికల్స్‌: ఫుడ్‌ ఆర్టికల్స్‌ 4.92 శాతం పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపల వంటి ప్రొటీన్‌ రిచ్‌ ఉత్పత్తుల ధరలు 10.88 శాతం పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 10.74 శాతం ఎగశాయి. పండ్ల ధరలు 27.43 శాతం ఎగశాయి. కాగా కూరగాయల ధరలు మాత్రం 9.03 శాతం తగ్గాయి.  

►  ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 20.94 శాతంగా ఉంది.  

► తయారీ ఉత్పత్తులు: సమీక్షా నెలలో 9.01 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది.  

► కాగా,  ఆర్‌బీఐ రెపో నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.29 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.

సరఫరాల సమస్య కనబడుతోంది
ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల 4.9 శాతంగా నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి. హోల్‌సేల్‌ స్థాయిలో సరఫరాల సమస్య తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. రానున్న నెలల్లో టోకు ద్రవ్యోల్బణం 13 నుంచి 13.5 శాతం శ్రేణికి పెరుగుతుందన్నది మా అంచనా. అలాగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరింత తగ్గిందన్న మా అభిప్రాయానికి కూడా గణాంకాలు బలాన్ని ఇస్తున్నాయి. అయితే బలహీన ఎకానమీ నేపథ్యంలో యథాతథ సరళతర ద్రవ్య పరపతి విధానాలనే ఆర్‌బీఐ కొనసాగిస్తుందని భావిస్తున్నాం.   
 – అదితీ నాయర్, ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌

అంతర్జాతీయంగా పెరిగిన ధరల ప్రభావం
కేవలం కొన్ని సీజనల్‌ కారణాల వల్లే టోకు ద్రవ్యోల్బణం పెరగలేదు. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలా టోకు ద్రవ్యోల్బణం అప్‌ట్రెండ్‌కు కారణం. ఖనిజాలు, వంట నూనెలు, ముడి చమురు, బొగ్గు, ఎరువులు, ప్లాస్టిక్, బేసిక్‌ మెటల్స్‌న, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఆటో తత్సంబంధ విడిభాగాల వెయిటేజ్‌ మొత్తం సూచీలో 44%. అంతర్జాతీయంగా ఆయా కమోడిటీల ధరలు పెరగడం దేశీయంగా కూడా ప్రభావం చూపింది.  ప్రపంచ మార్కెట్‌లో కమోడిటీల ధరలు మరింత పెరుగుతుండడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ద్రవ్యోల్బణం మరింత పెరక్కుండా ప్రభుత్వం సరఫరాల వ్యవస్థ పటిష్టతపై దృషి సారించాలి.
– సునీల్‌ కుమార్‌ సిన్హా, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ ఆర్థికవేత్త

మరిన్ని వార్తలు