హరిత భవనాలు: దేశంలోనే తొలిసారిగా గ్రీన్‌ ప్రాపర్టీ షో!

17 Jun, 2023 10:19 IST|Sakshi

మాదాపూర్‌ హైటెక్స్‌లో జూలై 28న ప్రారంభం

జూలై 30 తేదీ వరకు

సాక్షి, హైదరాబాద్‌: హరిత భవనాలలో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో నిలిచింది. గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో 1,027 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 11 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) గుర్తింపు పొందాయి. తెలంగాణలో 112 కోట్ల చ.అ.లలో 700లకు పైగా ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ ధ్రువీకరణ దక్కించుకున్నాయి. ఈక్రమంలో దేశంలోనే తొలిసారిగా హరిత భవనాల స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించాలని ఐజీబీసీ నిర్ణయించింది.

జూలై 28-30 తేదీలలో మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో గ్రీన్‌ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈమేరకు మంత్రులు కేటీ రామారావు, టీ హరీశ్‌రావులు ప్రాపర్టీ షో బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ వీసీ అండ్‌ ఎండీ ఈవీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు)

ఈ సందర్భంగా ఐజీబీసీ హైదరాబాద్‌ చాప్టర్, సీఐఐ తెలంగాణ చైర్మన్‌ సీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు హరిత భవనాల ప్రాముఖ్యత, పర్యావరణ బాధ్యత, ఆవశ్యకతలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాపర్టీ షోకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

నిర్వహణ వ్యయం, విద్యుత్, నీటి బిల్లుల తగ్గింపులతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి వాటిపై అవగాహన పెరుగుతుందన్నారు. 75కి పైగా ఐజీబీసీ సర్టిఫైడ్, ప్రీ-సర్టిఫైడ్‌ నివాస, వాణిజ్య సముదాయ ప్రాజెక్ట్‌లతోపాటు హరిత నిర్మాణ ఉత్పత్తులు, సాంకేతికత, సేవల సంస్థలు కూడా ఈ ప్రాపర్టీ షోలో పాలుపంచుకోనున్నారని వివరించారు.
 

మరిన్ని వార్తలు