ఐపీవోకు ఇండియాఫస్ట్‌ లైఫ్‌

24 Oct, 2022 06:34 IST|Sakshi

సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) ప్రమోట్‌ చేసిన ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,000–2,500 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.

అంతేకాకుండా వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్‌ సంస్థ బీవోబీ 8.9 కోట్లకుపైగా షేర్లను ఆఫర్‌ చేయనుంది. కార్మెల్‌ పాయింట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఇండియా 3.92 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1.30 కోట్లకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచనున్నాయి. ఇండియాఫస్ట్‌ లైఫ్‌లో బీవోబీ వాటా 65 శాతంకాగా.. కార్మెల్‌ పాయింట్‌(వార్‌బర్గ్‌ పింకస్‌)కు 26 శాతం, యూనియన్‌ బ్యాంక్‌కు 9 శాతం చొప్పున వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఇండియాఫస్ట్‌ లైఫ్‌ పేర్కొంది.
 

మరిన్ని వార్తలు