జర జాగ్రత్త! అక్కడ కొన్న ప్రతీ వస్తువు నకిలీదే! భారత్‌లో ఉన్న ఆ మార్కెట్ల వివరాలివిగో...

19 Feb, 2022 07:43 IST|Sakshi

వాషింగ్టన్‌: కాపీరైట్ల ఉల్లంఘన, నకిలీ ఉత్పత్తులకు పేరొందిన మార్కెట్ల జాబితాలో భారత్‌కు చెందిన బీటుబీ ఈ కామర్స్‌ పోర్టల్‌ ఇండియమార్ట్‌.కామ్‌ను యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ తన తాజా జాబితాలోకి చేర్చింది. భారత్‌ నుంచి మరో నాలుగు మార్కెట్లు.. ముంబైలోని హీరా పన్నా, ఢిల్లీలోని ట్యాంక్‌ రోడ్, పాలికా బజార్, కోల్‌కతాలోని కిడ్డర్‌పోర్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ‘ప్రపంచ నకిలీ మార్కెట్ల జాబితా 2021’ను యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎస్‌టీఆర్‌) గురువారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 42 ఆన్‌లైన్, 35 భౌతిక మార్కెట్లకు ఇందులో చోటు కల్పించింది. 

ఇవన్నీ పెద్ద ఎత్తున నకిలీ ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్‌ హక్కుల ఉల్లంఘనకు వీలు కల్పిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ‘‘నకిలీ, పైరేటెడ్‌ ఉత్పత్తులకు (కాపీరైట్‌ ఉన్న వాటికి నకిలీలు) సంబంధించి అంతర్జాతీయంగా నడుస్తున్న వాణిజ్యం అమెరికా ఆవిష్కరణలు, సృజనాత్మకతను దెబ్బతీస్తోంది. అమెరికా కార్మికులకు నష్టం కలిగిస్తోంది. ఈ చట్ట విరుద్ధమైన వ్యాపారం పెరగడం వల్ల నకిలీ ఉత్పత్తుల తయారీలో పాలు పంచుకునే కార్మికులను దోచుకునే విధానాలకు దారితీస్తుంది. నకిలీ ఉత్పత్తులు వినియోగదారులు, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు పెద్ద ముప్పు’’ అని యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ క్యాథరిన్‌ టే అన్నారు.  

పెద్ద మొత్తంలో నకిలీలు..
యూఎస్‌టీఆర్‌ నివేదిక ప్రకారం.. ‘‘కొనుగోలుదారులు, సరఫరాదారులను అనుసంధానం చేస్తూ, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆన్‌లైన్‌ బిజినెస్‌ టు బిజినెస్‌ (బీటుబీ) మార్కెట్‌గా చెప్పుకునే ఇండి యామార్ట్‌లో, పెద్ద మొత్తంలో నకిలీ ఉత్పత్తులు గుర్తించాం. నకిలీ ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్, వస్త్రాలు కూడా ఉన్నాయి. నకిలీ ఉత్పత్తులను ఏరిపారేయడానికి మెరుగైన విధానాలను ఇండియా మార్ట్‌ అమలు చేయకపోవడం పట్ల హక్కుదారులు ఆందోళన చెందుతున్నారు. విక్రయదారును నిర్ధారించుకోవడం, నకిలీ ఉత్పత్తుల విక్రయదారులకు జరిమానాలు విధించడం, సరైన పర్యవేక్షణ చేయలేకపోతున్నట్టు’’ పేర్కొంది.

ముంబైలోని హీరపన్నా మార్కెట్లో నకిలీ వాచ్‌లు, పాదరక్షలు, యాక్సెసరీలు, కాస్మొటిక్స్‌ విక్రయమవుతున్నట్టు తెలిపింది. ‘ఫ్యాన్సీ మార్కెట్‌’గా పేర్కొందిన కిడ్డర్‌పోర్‌ (కోల్‌కతా) నకిలీ బ్రాండ్ల వస్త్రాలు, కాస్మొటిక్స్‌కు కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది. వీటితో చర్మ సంబంధిత సమస్యలు, కంటి సమస్యలు వస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఢిల్లీలోని అండర్‌గ్రౌండ్‌ మార్కెట్‌ పాలికా బజార్‌ 2021 జాబితాలోనూ ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇక్కడ మొబైల్‌ యాక్సెసరీలు, కాస్మొటిక్స్, వాచ్‌లు, కళ్లద్దాల నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్నట్టు తెలిపింది. ట్యాంక్‌రోడ్‌  హోల్‌సేల్‌ మార్కెట్‌ వస్త్రాలు, పాదరక్షలు, వాచ్‌లు, హ్యాండ్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్స్, సౌందర్య ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు