Neal Mohan యూట్యూబ్‌ కొత్త సీఈవో: మరోసారి ఇండియన్స్‌ సత్తా

17 Feb, 2023 11:11 IST|Sakshi

సాక్షి, ముంబై: గ్లోబల్‌ టెక్‌ కంపెనీలకు సారధులుగా భారతీయ సంతతికి చెందిన నిపుణులు సత్తా చాటుతున్నారు. తాజాగా వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ సీఈవోగా ఇండో అమెరికన్‌ నీల్‌మోహన్‌ నియమితులయ్యారు. తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్‌  సీఈవోగా పనిచేసిన సుసాన్ వోజ్‌కికీ తప్పుకోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 

భారతీయ-అమెరికన్ నీల్‌మోహన్ 2015 నుండి యూట్యూబ్‌ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీచేసిన మోహన్‌  గతంలో మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు టెక్‌ కంపెనీల్లో కూడా పనిచేశారు. 

మరోవైపు దాదాపు పాతికేళ్లపాటు గూగుల్‌కు పనిచేసిన తాను  జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నానని సుసాన్‌  చెప్పారు. తన వ్యక్తిగత ప్రాజెక్టులకు సంబంధించి కొత్త పని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తన కెరీర్‌లో 2007లో డబుల్‌క్లిక్ కొనుగోలుతో గూగుల్‌కు వచ్చినప్పటినుంచీ దాదాపు 15 సంవత్సరాలు మోహన్‌తో కలిసి పనిచేశాననీ ఆమె చెప్పారు. అయితే గూగుల్‌, అల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌పిచాయ్‌కు సలహాదారుగా మార నున్నారని సమాచారం.



సుసాన్ వోజ్‌కికీ

కాగా ఇప్పటికే గ్లోబల్‌ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన  సీఈవోల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌ పెప్సికో ఇంద్రా నూయి, తమ ప్రత్యేకతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ  జాబితాలో నీల్ మోహన్ చేరడం విశేషం.  

మరిన్ని వార్తలు