న్యూఇయర్‌కి ముందే.. ఈ కార్ల కొనుగోలుపై కళ్లు చెదిరేలా భారీ డిస్కౌంట్లు

30 Dec, 2022 07:13 IST|Sakshi

న్యూఢిల్లీ: సరఫరా వ్యవస్థలు మెరుగుపడి కార్ల ఉత్పత్తి పెరిగే కొద్దీ నాలుగేళ్లుగా పేరుకున్న డిమాండ్‌ క్రమంగా తగ్గుతోంది. దీనికి సంవత్సరాంతం కూడా తోడు కావడంతో కొన్ని విభాగాల్లో అమ్మకాలు పెంచుకునేందుకు కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. 

చాలా మటుకు సంస్థలు డిసెంబర్‌లో 4.5 శాతం నుంచి 5 శాతం వరకూ డిస్కౌంట్స్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ప్రకటించిన 2 – 2.5 శాతంతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. డీలర్లు రూ. 25,000 నుంచి రూ. 1,00,000 దాకా విలువ చేసే ప్రయోజనాలు అందిస్తామంటూ కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా ఎంట్రీ–లెవెల్‌ కార్ల సెగ్మెంట్లోనూ, స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాలకు సంబంధించి పెట్రోల్‌ సెగ్మెంట్లోనూ ఇలాంటి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. నగదు డిస్కౌంట్లు, ఎక్సే్చంజ్‌ బోనస్‌ ప్రయోజనాలు, బీమా కంపెనీలు ఓన్‌ డ్యామేజీ ప్రీమియంను తగ్గించడం, డీలర్లు నిర్వహించే స్కీములు మొదలైన వాటి రూపాల్లో ఇవి ఉంటున్నాయి. 

మారుతీ సుజుకీ ఇండియా 2018–19 స్థాయిలోనే రూ. 17,000 – రూ. 18,000 వరకూ డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  సీఎన్‌జీకి, సాంప్రదాయ ఇంధనాల రేట్లకు మధ్య వ్యత్యాసం తగ్గిపోతుండటంతో సీఎన్‌జీ మోడల్స్‌ వైపు కొనుగోలుదారులు దృష్టి పెట్టడం తగ్గుతోంది. దీంతో సీఎన్‌జీ మోడల్స్‌ను విక్రయించేందుకు కంపెనీలు అత్యధికంగా రూ. 60,000 వరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. డిసెంబర్‌లో రిటైల్‌ విక్రయాలు పటిష్టంగా ఉన్నాయని, నవంబర్‌తో పోలిస్తే 20 శాతం ఎక్కువగా విక్రయాలు ఉండొచ్చని భావిస్తున్నామని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా వర్గాలు తెలిపాయి.  

పెరుగుతున్న నిల్వలతో ఒత్తిడి.. 
డీలర్ల దగ్గర నిల్వలు మళ్లీ కోవిడ్‌ పూర్వ స్థాయికి చేరినట్లు ఎస్‌అండ్‌పీ మొబిలిటీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 45–50 రోజుల వరకు సరిపడా నిల్వలు ఉంటున్నాయని పేర్కొన్నాయి. దీంతో డిస్కౌంట్లు ఇచ్చి అయినా వాహనాలను అమ్మేసేందుకు డీలర్లు మొగ్గుచూపుతున్నారని తెలిపాయి. వడ్డీ రేట్లు పెరుగుతుండటం కూడా సమస్యాత్మకంగా మారుతోంది. అటు ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. టాటా మోటార్‌ ఈ–నెక్సాన్‌కి ఇటీవలి వరకూ కొద్ది నెలల పాటు వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండేది. కానీ ప్రస్తుతం డీలర్‌షిప్‌లో బుక్‌ చేసుకుని అప్పటికప్పుడే కారుతో బైటికి వచ్చే పరిస్థితి ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.   

భవిష్యత్‌పై ఆచి తూచి.. 
ప్రస్తుతం దాదాపు 4,17,000 వాహనాల ఆర్డర్లతో కార్ల కంపెనీల ఆర్డర్‌ బుక్‌ పటిష్టంగా ఉంది. దీంతో కొంత ఎక్కువగా డిస్కౌంట్లు ఇచ్చేందుకు కంపెనీలు వెనుకాడటం లేదు. అయితే, భవిష్యత్‌లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంత అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, మార్కెట్‌ సెంటిమెంట్‌ మొదలైన వాటిని బట్టి డిమాండ్‌ పరిస్థితి ఉంటుందని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా వర్గాలు తెలిపాయి. 2018–19కి భిన్నంగా ప్రస్తుతం సంవత్సరాంతపు డిస్కౌంట్లు కొన్ని సెగ్మెంట్లకు మాత్రమే పరిమితంగా ఉంటున్నాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.

మరిన్ని వార్తలు