ఇండియన్‌ బ్యాంక్‌ లాభం అప్‌

1 Aug, 2022 06:42 IST|Sakshi

క్యూ1లో రూ. 1,213 కోట్లు

తగ్గిన మొండి బకాయిలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,213 కోట్లను అధిగమించింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 1,182 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,444 కోట్ల నుంచి రూ. 11,758 కోట్లకు బలపడింది.

వడ్డీ ఆదాయం 5.5 శాతం పురోగమించి రూ. 10,154 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 12 శాతం క్షీణించి రూ. 1,605 కోట్లకు పరిమితమైంది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,559 కోట్ల నుంచి రూ. 2,219 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు        (ఎన్‌పీఏలు) 9.69 8 శాతం నుంచి 8.13 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్‌పీఏలు సైతం 3.47 శాతం నుంచి 2.12 శాతానికి బలహీనపడ్డాయి. కనీ స మూలధన నిష్పత్తి 16.51 శాతంగా నమోదైంది.  

మరిన్ని వార్తలు