మంత్రిగారు మా గోడు వినండి! ట్యాక్స్‌–ఫ్రీ డిపాజిట్ల కాలాన్ని తగ్గించండి

18 Jan, 2022 08:58 IST|Sakshi

ఐబీఏ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: పన్ను రహిత స్థిర డిపాజిట్ల (ట్యాక్స్‌–ఫ్రీ ఎఫ్‌డీలు) కాలపరిమితిని ప్రస్తుత ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 2022–23 వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదనను ప్రవేశపెట్టాలని కోరింది. వచ్చే నెల ఒకటవ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఐబీఐ చేసిన బడ్జెట్‌ ముందస్తు సిఫారసుల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 

► ఈక్విటీ అనుసంధాన పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్‌) వంటి మ్యూచువల్‌ ఫండ్‌ ప్రొడక్స్‌కు అందిస్తున్న పన్ను ప్రయోజనాలను స్థిర డిపాజిట్లకు అందించాలి. ఇందుకు సంబంధించి పన్ను రహిత స్థిర డిపాజిట్ల కాలపరిమితిని మూడేళ్లకు తగ్గించాలి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్‌ 80సీ కింద ఐదేళ్ల స్థిర డిపాజిట్‌ పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేయవచ్చు. సెక్షన్‌ 80సీ కింద రూ. 1.50 లక్షల పనున మినహాయింపు ఉంది.  

►  మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్స్‌  (ఈక్విటీ అనుసంధాన పొదుపు పథకాల వంటివి) పోలిస్తే, పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) తక్కువ ఆకర్షణీయంగా ఉంది. అయితే లాక్‌–ఇన్‌ వ్యవధిని తగ్గించినట్లయితే, పన్నుల పరంగా స్థిర డిపాజిట్లు కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. తద్వారా బ్యాంకులకు సైతం నిధుల లభ్యత పెరగుతుంది.
 
► బలహీన రంగాలను ప్రోత్సహించడం, వివిధ పథకాలను అమలుచేయడంసహా అందరికీ ఆర్థిక ఫలాలు అందించడం, బ్యాంకింగ్‌ సేవల విస్తృతి, డిజిటల్‌ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడం, ఐటీ వ్యయాలవంటి అంశాలకు బ్యాంకులు వివిధ ఖర్చులను బ్యాంకింగ్‌ భరిస్తోంది. వీటి భర్తీకి కొంతమేర ప్రత్యేక రిబేట్లు, అదనపు ప్రోత్సహకాలను కూడా బ్యాంకింగ్‌ కోరుతోంది.  

► పన్నులకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగం బ్యాంకింగ్‌కు అవసరం.  

► బ్యాంకుల అప్పీళ్ల వ్యవహారాల్లో గణనీయమైన మొత్తాలు కూడా ఉంటాయి. అయితే విచారణ సందర్భల్లో భారీ మొత్తాలకు సంబంధించిన అంశాలనుకూడా చిన్న మొత్తాలతో కూడిన అప్పీళ్లతో సమానంగా పరిగణిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. 

► బ్యాంకులు–ప్రభుత్వ వాఖ మధ్య అప్పీళ్ల వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు ఉండాలి.
 
►  పన్ను శాఖ– బ్యాంకుల మధ్య వ్యాజ్యాలను తగ్గించడానికి, అప్పీల్‌ ప్రక్రియ విచారణను వేగవంతంగా పూర్తి చేయడానికి ఖచ్చితమైన సమయపాలనతో ఏర్పాటు చేయబడిన వివాదాల కమిటీ మాదిరిగానే ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగం అవసరం.  

చదవండి: కేంద్ర బడ్జెట్‌లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..!

మరిన్ని వార్తలు