డిపాజిట్‌ రేట్ల షాక్‌: తగ్గనున్న బ్యాంకింగ్‌ మార్జిన్లు      

8 Feb, 2023 11:42 IST|Sakshi

2023-24 ఆర్థిక సంవత్సరంపై రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అంచనా

0.1 శాతం  తగ్గి 3.45 శాతానికి చేరుతుందని విశ్లేషణ

ముంబై: డిపాజిట్‌ రేట్ల పెరుగుదల నేపథ్యంలో బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజం-ఫిచ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న మార్చితో ముగిసే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.55 ఉంటే, 2023-24లో ఇది 3.45 శాతానికి తగ్గుతుందన్నది ఫిచ్‌ అంచనా.  

సుస్థిర అధిక రుణవృద్ధికి మద్దతు ఇవ్వడానికి పలు బ్యాంకులు భారీగా డిపాజిట్ల సేకరణకు మొగ్గుచూపుతుండడం తాజా ఫిచ్‌ నివేదిక నేపథ్యం. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీమార్జిన్‌ 3.1 శాతం అని పేర్కొన్న ఫిచ్, తాజా అంచనా గణాంకాలు అంతకుమించి ఉన్న విషయాన్ని ప్రస్తావించింది.

నివేదికలో మరిన్ని విశేషాలు చూస్తే.. 
 మార్జిన్‌లో 10 బేసిస్‌ పాయింట్ల  (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం)  తగ్గుదల అంటే సమీప కాలంలో బ్యాంకుల లాభదాయకతను ప్రభావితం చేసే అవకాశం లేదు.  అధిక రుణ వృద్ధి వల్ల అధిక ఫీజు ఆదాయం రూపంలో వస్తుంది. అలాగే ట్రజరీ బాండ్ల ద్వారా లాభాలూ ఒనగూరుతాయి. వెరసి ఆయా అంశాలు తగ్గనున్న మార్జిన్ల ఒత్తిళ్లను సమతూకం చేస్తాయి. అదే విధంగా బ్యాంకింగ్‌ మూలధన పటిష్టతకూ మద్దతునిస్తాయి.  
 ఇక రిటైల్‌ అలాగే సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య (ఎంఎస్‌ఎంఈ) తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును నెమ్మదిగా పెంచినా, కార్పొరేట్‌ రుణ రేటును బ్యాంకులు క్రమంగా పెంచే వీలుంది. ఇది మార్జిన్ల ఒత్తిళ్లను తగ్గించే అంశం.  
 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రుణ వృద్ధి సగటును 17.5 శాతం ఉంటే, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 13 శాతంగా నమోదుకావచ్చు. రుణ డిమాండ్‌ క్రమంగా పుంజుకోవడం దీనికి నేపథ్యం.  
 

మరిన్ని వార్తలు