విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు రెట్టింపు

19 Jul, 2021 01:06 IST|Sakshi

జూన్‌లో 2.8 బిలియన్‌ డాలర్లు

ముంబై: దేశీ కంపెనీలు ఈ ఏడాది జూన్‌లో విదేశాల్లో ప్రత్యక్షంగా పెట్టిన పెట్టుబడులు 2.80 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది జూన్‌ నాటి 1.39 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు. అయితే, వార్షికంగా పెరిగినప్పటికీ నెలవారీగా చూసినప్పుడు ఈ ఏడాది మేలో నమోదైన 6.71 బిలియన్‌ డాలర్ల కన్నా జూన్‌లో పెట్టుబడులు సుమారు 58 శాతం తక్కువ కావడం గమనార్హం. రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం మొత్తం పెట్టుబడుల్లో 1.17 బిలియన్‌ డాలర్లు పూచీకత్తు రూపంలో, 1.21 బిలియన్‌ డాలర్లు రుణంగాను, మరో 427 మిలియన్‌ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి రూపంలోను నమోదైంది.

భారీ పెట్టుబడుల్లో టాటా స్టీల్‌ .. సింగపూర్‌లోని తమ అనుబంధ సంస్థలో 1 బిలియన్‌ డాలర్లు, విప్రో తమ అమెరికా విభాగంలో 787 మిలియన్‌ డాలర్లు, టాటా పవర్‌ .. మారిషస్‌లోని యూనిట్‌లో 131 మిలియన్‌ డాలర్లు మొదలైన డీల్స్‌ ఉన్నాయి. డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్‌ సర్వీసెస్, ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్, ఓఎన్‌జీసీ విదేశ్, పహార్‌పూర్‌ కూలింగ్‌ టవర్స్, టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొదలైనవి విదేశాల్లో ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవి 45 మిలియన్‌ డాలర్ల నుంచి 56 మిలియన్‌ డాలర్ల దాకా ఇన్వెస్ట్‌ చేశాయి. ఇది ప్రాథమిక డేటా మాత్రమేనని, అధీకృత డీలర్‌ బ్యాంకుల నివేదికలను బట్టి మారవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు