మాజీ ఉద్యోగి ఫిర్యాదుతో కోర్టు నోటీసులు

26 Jul, 2020 13:04 IST|Sakshi

ఈకామర్స్‌ దిగ్గజానికి భారీ షాక్‌

సాక్షి, న్యూఢిల్లీ : అలీబాబా వ్యవస్ధాపకుడు జాక్‌ మాతో పాటు దిగ్గజ ఈకామర్స్‌ సంస్థకు భారత కోర్టు సమన్లు జారీ చేసింది. కంపెనీ యాప్‌లు, డాక్యుమెంట్లలో సెన్సార్‌షిప్‌, ఫేక్‌ న్యూస్‌లపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగం నుంచి తొలగించారని భారత్‌లో కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సరిహద్దు వివాదం నేపథ్యంలో భద్రతా కారణాలు చూపుతూ అలీబాబాకు చెందిన యూసీ న్యూస్‌, యూసీ బ్రౌజర్‌ సహా 57 చైనా యాప్‌లను భారత్‌ నిషేధించిన క్రమంలో ఈ కేసు వెలుగుచూసింది. అలీబాబా, జాక్‌ మా సహా కంపెనీకి చెందిన 12 మంది అధికారులను ఈనెల 29న కోర్టు ఎదుట హాజరుకావాలని గురుగ్రాం జిల్లా కోర్టు సివిల్‌ జడ్జి సోనియా షికండ్‌ నోటీసులు జారీ చేశారు.

చైనాతో పాటు డ్రాగన్‌ యాప్స్‌ యూసీ బ్రౌజర్‌, యూసీ న్యూస్‌లకు ప్రతికూలంగా ఉన్న కంటెంట్‌ను కంపెనీ సెన్సార్‌ చేసేదని, వీటిని సామాజిక, రాజకీయ గందరగోళానికి తావిచ్చేవిగా చూపేవని అలీబాబాకు చెందిన యూసీ వెబ్‌ మాజీ ఉద్యోగి పుష్పేంద్ర సింగ్‌ పర్మార్‌ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. వీటిపై ప్రశ్నించినందుకు తనను అకారణంగా తొలగించారని ఆ పత్రాల్లో వెల్లడించారు. ఈ ఫిర్యాదుపై సమన్లలో పేర్కొన్న విధంగా 30 రోజుల్లోగా తమ స్పందనను లిఖితపూర్వకంగా తెలియచేయాలని న్యాయమూర్తి అలీబాబా కంపెనీతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌లను కోరారు. కాగా, భారత్‌లో పనిచేసే స్ధానిక ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడిఉన్నామని, స్ధానిక చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని యూసీ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత వివాదంపై తాము ఇప్పటికిప్పుడు వ్యాఖ్యానించే పరిస్థితిలో లేమని తెలిపింది. చదవండి : జాక్‌ మాను వెనక్కినెట్టి..

ఇక 2017 అక్టోబర్‌ వరకూ గురుగ్రాంలోని యూసీ వెబ్‌ కార్యాలయంలో పార్మర్‌  అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించినందుకు పరిహారంగా 2,68,000 డాలర్లు చెల్లించాలని పర్మార్‌ కోరుతున్నారని రాయ్‌టర్స్‌ పేర్కొంది. కాగా, దీనిపై పర్మార్‌ న్యాయవాది అతుల్‌ అహ్లావత్‌ను సంప్రదించంగా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ వ్యాఖ్యానించనని పేర్కొనట్టు తెలిపింది. యూసీ వెబ్‌ భారత్‌లో పలువురు ఉద్యోగులను తొలగించిన మీదట చైనా యాప్‌ల నిషేధం నిర్ణయంతో తాజా కోర్టు కేసు భారత్‌ మార్కెట్‌లో అలీబాబాకు అవరోధంగా మారింది. కాగా భారత సమగ్రతకు ఆయా చైనా యాప్‌లు ముప్పుగా పరిణమించాయని విశ్వసనీయ సమాచారం అందడంతోనే వాటిని నిషేధించామని భారత్‌ చెబుతోంది.

మరిన్ని వార్తలు