మరిన్ని చర్యలకు సిద్ధం

17 Sep, 2020 07:15 IST|Sakshi

ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిన పడలేదు

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

వృద్ధికి మద్దతిస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ రికవరీ అంత ఆశాజనకంగా ఏమీ లేదన్నారు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌. కనుక వృద్ధికి మద్దతుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన వర్చువల్‌ సమావేశాన్ని ఉద్దేశించి దాస్‌ మాట్లాడారు. కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాల ఆధారంగా తెలుస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ కాలంలో దేశ జీడీపీ మైనస్‌ 23.9%కి పడిపోయిన విషయం తెలిసిందే. ‘‘వ్యవసాయానికి సంబంధించిన సంకేతాలు ఎంతో ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. తయారీ రంగ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ), ఉపాధిలేమి పరిస్థితులు రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) స్థిరపడతాయని కొన్ని అంచనాల ఆధారంగా తెలుస్తోంది. అదే సమయంలో కొన్ని ఇతర రంగాల్లోనూ పరిస్థితులు తేలికపడతాయి’’ అని దాస్‌ చెప్పారు. ఆర్థిక రికవరీ ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదని.. ఇది క్రమంగా సాధ్యపడుతుందని పేర్కొన్నారు. లిక్విడిటీ, వృద్ధి, ధరల నియంత్రణకు అన్ని చర్యలను ఆర్‌బీఐ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

‘ఎన్‌బీఎఫ్‌సీ’లు బలహీనంగా..  
ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు.. మధ్య కాలానికి మన్నికైన, స్థిరమైన వృద్ధిని సాధించడమే విధానపరమైన చర్యల ఉదేశమని శక్తికాంతదాస్‌ వివరించారు. ‘‘మార్కెట్లను చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూనే ఉంటాము. ఆర్‌బీఐ పోరాటానికి సిద్ధంగా ఉందని నేను గతంలోనే చెప్పారు. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తదుపరి చర్యలు ఉంటాయి’’ అని దాస్‌ తెలిపారు.  నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగం (ఎన్‌బీఎఫ్‌సీ) బలహీనంగా ఉండడం ఆందోళనకరమన్నారు. అగ్రస్థాయి 100 ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్‌బీఐ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని.. ఏ ఒక్క పెద్ద సంస్థ కూడా వైఫల్యం చెందకూడదన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపారు.  

డిపాజిటర్ల ప్రయోజనాలు ముఖ్యం..
డిపాజిటర్ల ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకాన్ని రూపొందించామని దాస్‌ చెప్పారు. ఏ బ్యాంకింగ్‌ వ్యవస్థకు అయినా డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు